ఢిల్లీలో రాజకీయాలా?

13-10-2026 | 05:35am

రైతులు గోసపడుతుంటే..

  1. రాష్ట్రం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమా? 
  2. సింగూరు ప్రాజెక్టు గురించి పట్టదా?
  3.    9 నెలలవుతున్నా ఎల్ నినోపై యాక్షన్ ప్లాన్ ఏదీ.. 
  4. బీర్ల కంపెనీలకు నీళ్లిస్తరు కానీ సాగుకు ఇవ్వరా? 
  5. సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ ఆగ్రహం 

అక్టోబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్రంలో సాగు నీరు అందక రైతులు గోసపడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సహా మంత్రులంతా ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. రైతుల సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సింగూరు ప్రాజెక్టులో(Singur Project) వాడుకునేందుకు రెండు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, ఆ నీళ్లను బీర్ల కంపెనీలకు(Beer companies) ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. సిం గూరుపై కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ ఏమిటని ప్రశ్నించారు. కరువు, ఎల్ నినో పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే ప్రభు త్వం మాత్రం పట్టింపులేనితనంతో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులంతా సోమవారం ఉదయం 11 గంటలకు రైతు వేదికలకు రావాలని, సీఎం మాట్లాడతారంటూ అంతకుముందు రోజు మెసేజ్‌లు పంపి, తర్వాత వీడియో కాన్ఫ రెన్స్ రద్దు చేసినట్లు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు.

గత ఏడాది సింగూరు ప్రాజెక్టులో 29 టీఎంసీల నీరు ఉండేదని, ప్రాజెక్టును ఏడాదిలో బాగుచేస్తామని చెప్పి, ఉన్న నీటిని వదిలేశారని, కానీ ఒక్క పని కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. ‘రెండురోజుల కింద ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ అప్పుడు ముఖ్యమంత్రి గోవా వెళ్లారు... మంత్రులు ఢిల్లీ వెళ్లారు... పొంగులేటి మాటలు తుస్సు అయ్యాయి’ అని ఆయన ఎద్దేవా చేశారు. 

పంటలు వేయకుండా ఎలా బతుకుతరు?

క్యాబినెట్ సమావేశం లేదని, వీడియో కాన్ఫరెన్స్ కూడా సక్రమంగా నిర్వహించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని హరీశ్‌రావు విమర్శించారు. రైతులపై, రాష్ట్రంపై ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. ఎల్ నినో ప్రభావంపై గత తొమ్మిది నెలలుగా ప్రపంచ శాస్త్రవేత్తలు, భారత ప్రభుత్వ సంస్థలు హెచ్చరిస్తున్నా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని మండిపడ్డారు. ‘తొమ్మిది నెలలుగా రైతుల కోసం తీసుకున్న చర్యలేంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

పంటలు వేయొద్దంటూ లీకులు ఇప్పించి వార్తలు రాయిస్తున్నారు. రైతులు పంటలు వేయకపోతే ఏం చేయాలి? రైతు కూలీల పరిస్థితి ఏంటి? రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఎలా బతకాలి? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో బల్లలు చరిచారు తప్ప క్షేత్రస్థాయిలో ఏం చేశారు? కాంట్రాక్టులు, విదేశీ పర్యటనలకు సమయం ఉంటుంది కానీ, పేదలకు భరోసా కల్పించడానికి సమయం లేదా? మంత్రులు తుమ్మల, పొంగులేటి రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం కాదు.. ప్రభుత్వం ఏం చేయబోతున్నదో స్పష్టంగా చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లా కూలీలు ఉపాధి కోసం కర్ణాటకకు వలస వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్రం

ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉంటే కనీసం వీడియో కాన్ఫరెన్స్‌లోనైనా పాల్గొనలేరా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం రైతులను భయపెడుతున్నదని మండిపడ్డారు. ‘రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. బొగ్గు కొరతకు, విద్యుత్ కోతలకు కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యమే కారణం.  బొగ్గు లేదంటే ఎల్ నినో అంటారు.. కరెంట్ లేదంటే ఎల్ నినో అంటారు.. నీళ్లు లేవంటే ఎల్ నినో అంటారు. అసలు బొగ్గు కొరతకు ఎల్ నినోకు సంబంధం ఏమిటి? నైనీ బొగ్గు గనిలోని బొగ్గును తీసుకొచ్చి ముందుగానే నిల్వలు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు?’ అని ఆయన నిలదీశారు.

ఇతర రాష్ట్రాలు ముందుగానే అప్రమత్తమై విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఆరు నుంచి ఏడు గంటల విద్యుత్ కూడా సక్రమంగా రావడం లేదని, చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. ‘రాష్ట్రంలో దేవాదుల ప్రాజెక్టు మోటార్లు నడపరు... కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సక్రమంగా వినియోగించరు.. పాలమూరు నీళ్లను ఎత్తకుండా, ఇక్కడి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్ల ఇతర ప్రాంతాలకు నీళ్లు తరలించే పరిస్థితి వస్తున్నది.

పాలమూరు ప్రజలకు నీళ్లు అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహిగా మిగిలిపోతున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ అసమర్థత వల్లే వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తే వాటి జీవితకాలం తగ్గుతుందని చెప్పినా పట్టించుకోలేదు. పది మోటార్లు నడవాల్సిన దేవాదులలో రెండు మోటార్ల బేరింగులు దెబ్బతిన్నాయి.  ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. మీ ప్రభుత్వం తెచ్చిన కరువు’ అని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.

సింగూరు ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. ‘దసరాకు మద్యం కొరత ఉండకూడదని, మద్యం కంపెనీలకు నీళ్లు అందుబాటులో ఉంటాయి కానీ తాగునీరు, సాగునీటి కోసం మాత్రం ప్రజలు ఇబ్బందులు పడాల్నా? జూరాలలో కండ్లముందే నీళ్లు కనిపిస్తున్నా, ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు గేట్లు తెరిచి నీళ్లు తీసుకున్న రైతుల్లో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు’ అని ఆయన తెలిపారు. పక్క రాష్ట్రాల్లో లేని కరువు తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని ఆయన అన్నారు. రైతుల సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీ రాజకీయాలకే సీఎం, మంత్రులు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు