మమ్మల్ని పోలీసులు కిడ్నాప్ చేశారు

12-10-2026 | 05:25am
  1. మా ఫోన్లను గుంజుకున్నారు.. వాటిని క్లోన్ చేసి ఉండొచ్చు
  2. సీఈసీ జ్ఞానేశ్‌ను రక్షించేందుకు మోదీ, అమిత్ షా ప్లాన్
  3. ఆయన రాజీనామా చేసేవరకు వెనక్కి తగ్గబోం
  4. మీడియాతో సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా
  5. అంతకుముందు స్టేషన్ నుంచి దీప్కే, దాస్, రంకా విడుదల
  6. నాన్నమ్మ అంత్యక్రియల కోసం మహారాష్ట్రకు వెళ్లిన దీప్కే

న్యూఢిల్లీ, అక్టోబర్ 11:  ఢిల్లీ పోలీసులు(Delhi Police) తమను కిడ్నాప్ చేశారని, విమానంలో నుంచి దిగకముందే అదుపులోకి తీసుకొని భయాందోళనలు సృష్టించారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)(Cockroach Janata Party) ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్‌రంకా అన్నారు. తమకు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని.. కనీసం లాయర్‌ను సంప్రదించేందుకు కూడా అనుమతి ఇవ్వలేదని తెలిపారు.

కిడ్నాప్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా తాము భయపడబోమని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసేవరకు ఉద్యమం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.

జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ముంబై నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేతోపాటు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను పోలీసులు ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే విమానంలో అదుపులోకి తీసు కున్నారు. వారిని విడుదల చేయాలని ఆదివారం స్థానిక కోర్టు ఆదేశించడంతో బయ టకు వచ్చారు. నాన్నమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అభిజిత్ దీప్కే మహారాష్ట్రకు వెళ్లగా.. సౌరవ్‌దాస్, అశుతోష్‌రంకా మీడి యాతో మాట్లాడారు. 

ఫోన్లను క్లోన్ చేసి ఉండొచ్చు

కనీసం విమానంలో నుంచి కూడా దిగే వరకు పోలీసులు తమకు అవకాశం ఇవ్వలేదని, విమానంలోనే కిడ్నాప్ చేశారని సౌరవ్ దాస్ అన్నారు. తమ ఫోన్లను కూడా గుంజుకున్నారని, వాటిని క్లోన్ చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘మా ఫోన్లను 24 గంటలకుపైగా పోలీసులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. వాటిని హ్యాక్ చేసి ఉండొచ్చు..

క్లోన్ చేసి ఉండొచ్చు. ఏదై నా చేసి ఉంటారని అనుమానాలు బలంగా ఉన్నాయి’ అని సౌరవ్ దాస్ తెలిపారు. ఇలాంటి ఎమర్జెన్సీ పరిస్థితిని దేశం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని అశుతోష్ రంకా అన్నారు. జ్ఞానేశ్‌కుమార్‌ను కాపాడేందుకు మోదీ, అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని.. ఇందుకోసం దేశప్రజలపై అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని మండిపడ్డారు. ఏం చేసినా తాము వెనక్కి తగ్గబోమని, పోరాటాన్ని కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు అన్నారు. 

నాన్నమ్మ అంత్యక్రియలకు దీప్కే

శనివారం దీప్కే  నాన్నమ్మ చనిపోయిన విషయం తెలిసిందే. ఆదివారం పోలీసుల నుంచి విడుదలైన అనంతరం తాను నాన్నమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఏడాది పాటు శాంతికి భంగం కలిగించొద్దన్న కోర్టు

జంతర్ మంతర్‌లో నిరసనల దృష్ట్యా ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను ఆదివారం ఢిల్లీ స్థానిక కోర్టు విడుదల చేసింది. ఏడాదిపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని మెజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో ఆ ముగ్గురిని పోలీసులు రిలీజ్ చేశారు.

అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను శనివారం ఉదయం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో దాదాపు ఏడువేల మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆరోజు రాత్రి దాదాపు అందరినీ విడిచిపెట్టిన పోలీసులు.. ఈ ముగ్గురిని మాత్రం విడుదల చేయలేదు. ఆదివారం ఉదయం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో వారిని కోర్టు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు