మరింత వేగంగా.. క్షేమంగా..!

12-10-2026 | 05:25am
  1. కేబీఆర్ పార్క్ చుట్టూ విజయవంతమైన వన్ వే
  2. మరింత సజావుగా వాహనాలు పరుగెత్తేలా వసతుల కల్పన
  3. చురుగ్గా సాగుతున్న జంక్షన్ల విస్తరణ, ఫ్లైఓవర్ ప్రాజెక్ట్
  4. శాశ్వత వన్-వేకు ట్రాఫిక్ ఐలాండ్‌ల పునఃనిర్మాణం
  5. విలువైన స్థలాలు ఇచ్చిన బాలకృష్ణ, శబ్దాలయా స్టూడియో, భవ్య కన్‌స్ట్రక్చన్స్ 

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): బండి వేగం అందుకునేలోగా పడిపోయే ట్రాఫిక్ సిగ్నళ్లు.. రహదారులను(Roads) మించిన కూడళ్లు.. ఆగుతూ.. సాగుతూ.. వాహనదారులకు నిత్యం నరకం కనిపించే కేబీఆర్ పార్క్(KBR Park) చుట్టూ ప్రయాణం.. ఒక్క ఆలోచనతో మారిపోయింది.. ప్రయోగాత్మకంగా పరిశీలించిన వన్ వే విధానం విజయవంతమైంది.

దాంతో దానిని శాశ్వతంగా మార్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రయాణం సజావుగా సాగుతోంది. అయితే, ఇందులోనూ చిన్న, చిన్న సమస్యలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించి మరింత వేగంగా, క్షేమంగా ట్రాఫిక్ సాగేందుకు జీహెచ్‌ఎంసీ పనులు చేపడుతోంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాలనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) సంకల్పంతో నగరంలో వివిధ పనులు వేగంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలోనే కేబీఆర్ పార్క్ పనులను చేపట్టారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లు ఎత్తుపల్లాలుగా, కొన్ని చోట్ల పెద్దవిగా, మరికొన్ని చోట్ల చిన్నవిగా ఉన్నాయి. అలాగే ఇతర ప్రాంతాలకు మళ్లే మార్గాలు సక్రమంగా లేవు. ఈ నేపథ్యంలో వాటిని సరైన విధంగా మార్పులు చేస్తున్నారు. ప్రధానంగా అగ్రసేన్ జంక్షన్‌తో పాటు కీలకమైన రోటరీ ఐలాండ్‌ల వద్ద పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నారు.

వన్-వే ట్రాఫిక్ సజావుగా సాగడానికి, వాహనాలు సురక్షితంగా ఒక లేన్ నుంచి మరో లేన్‌కు మారడానికి వీలుగా ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నెం. 45 జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఛానలైజేషన్ ఐలాండ్‌లను (ట్రాఫిక్ విభజన దిమ్మెలు) ఏర్పాటు చేస్తున్నారు. కేబీఆర్ పార్క్ సమీపంలోకి చేరిన వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్లడంతో పాటు ఎటువంటి ఆటంకం లేకుండా ఎడమ వైపునకు (లెప్ట్ ఫ్రీ టర్న్ ) మళ్లేందుకు, అలాగే ముందుకు సాగేందుకు వీలుగా శాశ్వత వన్-వే విధానానికి అనుగుణంగా అన్ని జంక్షన్ ఐలాండ్‌లను పునఃనిర్మిస్తున్నారు. 

పాదచారుల భద్రతకు పెద్దపీట

వన్-వే విధానంతో సహజంగానే వాహనాల వేగం పెరుగుతుంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనదారులు, పాదచారుల భద్రతకు పెద్దపీట వేసేందుకు వాహనాలు ఎక్కడ ఎటు వైపు మళ్లుతాయి.. ఎక్కడ క్రాసింగ్ ఉంది.. ఎక్కడ మళ్లాలనే దానిని చూపేలా రహదారులపై గుర్తులు, సైట్ లైన్స్ , క్రాసింగ్ పాయింట్లు, ప్రత్యేక వీవింగ్ జోన్ల పనులు చేస్తున్నారు. 

అయిదు జంక్షన్లు దాటేలా ఎలివేటెడ్ కారిడార్

ముఫఖంజా కాలేజ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకు 4.3 కిలోమీటర్ల దూరం 6-వరుసల ఎలివేటెడ్ కారిడార్ పనులు జోరుగా సాగుతున్నాయి. పర్యావరణహితంగా, వేగంగా నిర్మించేందుకు రూ.1,090 కోట్లతో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం 1ను అనుసంధానించేలా ప్రత్యేక కనెక్టింగ్ ర్యాంప్ నిర్మిస్తున్నారు.

ఈ ఎలివేటెడ్ కారిడార్‌తో 5 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఆగే పని లేకుండా పోతుంది. ఫలితంగా ప్రయాణ సమయం తగ్గడంతో పాటు వాహనాల ఇంధన వినియోగం గణనీయంగా తగ్గి వాహనదారులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయి.

ఈ ఎలివేటెడ్ కారిడార్ కింద రహదారి విస్తరణ పనులు చేపట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ కారిడార్‌కు బదులుగా రహదారుల విస్తరణ చేపడితే ప్రైవేట్ ఆస్తుల సేకరణకే సుమారు రూ.1000 కోట్లు వెచ్చించాల్సి వచ్చేది. ఆ రూపేణా ఖజానాకు మేలు జరగడంతో పాటు ప్రైవేట్ భూములు సేకరించాల్సిన ఇబ్బంది కూడా లేకుండా పోయింది.

సీనీ నటుడు బాలకృష్ణ ఔదార్యం

కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే సజావుగా సాగాలంటే పలు చోట్ల విలువైన ఆస్తులు సేకరించాల్సి వచ్చింది. అందులో ప్రధానమైనవి సినీ నటుడు బాలకృష్ణ ఇంటి స్థలం, శబ్దాలయా స్టూడియో, భవ్య కన్‌స్ట్రక్చన్ భవనం. అయితే, తమ స్థలాలు ఇచ్చేందుకు వారంతా ముందుకొచ్చారు. ఇక్కడ గజం రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు పలుకుతోంది.

భారీ ధరతో పాటు నగరం నడిబొడ్డున ఉన్న స్థలాలు కావడంతో నివాసం, వ్యాపారానికి ఇవి ఎంతో కీలకమైనవి. బంజారాహిల్స్/జూబ్లీహిల్స్ నుంచి కేబుల్ బ్రిడ్జ్, దుర్గం చెరువు, నాలెడ్జ్ సిటీ (హైటెక్ సిటీ) వైపు వెళ్లే భారీ రద్దీని నివారించాలంటే సినీ నటుడు బాలకృష్ణ ఇంటి ముందు రోడ్ నెం 45 జంక్షన్‌ను బాగా విస్తరించాల్సి ఉంది.

ఇందుకోసం అధికారులు బాలకృష్ణను సంప్రదించగా తాను ఉంటున్న ఇంటి స్థలంలో సుమారు 862.77 చదరపు గజాలు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారు. ఈ జంక్షన్‌ను విస్తరిస్తే టెక్ పార్కుల వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ జామ్ కాదు. దీంతో ప్రతిరోజూ ప్రధాన ఐటీ హబ్‌లకు వెళ్లే వేలాది మంది ఉద్యోగుల ప్రయాణం సులభమవుతుంది. బాలకృష్ణ కోసం ఎన్టీఆర్ 1982లో ఆ ఇంటిని నిర్మించి ఇచ్చారు.

దశాబ్దాలుగా బాలకృష్ణ ఆ ఇంట్లోనే ఉంటున్నారు. నందమూరి కుటుంబ వేడుకలకు ఆ ఇల్లు ఓ వేదిక. ఎన్టీఆర్ తన అభిమానులను ఆ ఇంటి నుంచే కలిసేవారు. ఇంత అనుబంధం ఉన్నా ప్రజాప్రయోజనాల కోసం ఆ స్థలాన్ని ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకరించారు. ప్రస్తుత పనులతో బాలకృష్ణ ఇంటిలోని ఓ భవనం సగానికి పైగా పోతోంది. ఆయన సైతం ఇక్కడి నుంచి మారాల్సి వస్తుంది. అయినా పరిహారం తీసుకోకుండానే ఆయన స్థలం ఇచ్చివేశారు. టీడీఆర్ తీసుకునేందుకు అంగీకరించారు.

శబ్దాలయ స్టూడియో పెద్ద మనస్సు

కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద శబ్దాలయ స్టూడియో ఉంది. ఈ జంక్షన్ వన్-వేకు ఎంట్రన్స్‌గా ఉంది. పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వచ్చే భారీట్రాఫిక్‌ను ఇది నియంత్రిస్తుంది. ఈ జంక్షన్ వద్ద ఎటువంటి ఆటంకం లేకుండా ఫ్రీ లెఫ్ట్-టర్న్ సాగేందుకు, ఇతర మార్గాల్లోకి మళ్లే వాహనాలు ట్రాఫిక్ జామ్‌ల్లో చిక్కుకోకుండా సజావుగా సాగిపోవడానికి ఇక్కడ విస్తరణ అవసరం.

ఇందుకు శబ్దాలయ స్టూడియోకు చెందిన సుమారు 608 చదరపు గజాల స్థలం అవసరమైంది. ఆ మొత్తాన్ని పరిహారం తీసుకోకుండా టీడీఆర్‌తోనే శబ్దాలయ యాజమాన్యం ఇచ్చింది. ఈ పనులతో శబ్దాలయ స్టూడియో ప్రహరీతో పూర్తిగా పోవడంతో పాటు ప్రధాన భవనం వరకు పనులు సాగుతున్నాయి.

భవ్య కన్‌స్ట్రక్చన్స్ సైతం..

జూబ్లీహిల్స్ లోపలి కాలనీలను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, పశ్చిమ ఐటీ కారిడార్‌తో  ఫిల్మ్‌నగర్ జంక్షన్ అనుసంధానిస్తుంది. ఈ జంక్షన్ వద్ద రోడ్డు మార్పులతో వాహనాల లేన్ మార్పులకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. దీంతో బ్యాంకింగ్, టెక్ హబ్‌ల వైపు వెళ్లే కార్పొరేట్ రవాణా వాహనాలు, ప్రైవేట్ వాహనాలు ఎక్కడా ఆగకుండా నిరంతరాయంగా వెళ్లడానికి వీలవుతుంది.

ఇక్కడ పనుల కోసం భవ్య కన్‌స్ట్రక్చన్స్‌కు సుమారు 341.33 చదరపు గజాల స్థలాన్ని పరిహారం తీసుకోకుండా టీడీఆర్‌తో అప్పగించింది. ఈ పనుల్లో భవ్య కన్‌స్ట్రక్చన్‌కు చెందిన భవనం పూర్తిగా పోతోంది.

మరిన్ని వార్తలు