పల్లె ముంగిట వైద్యం.. పేదల ఆరోగ్యానికి భరోసా!

12-10-2026 | 05:10am
  1. డాక్టర్ జువేరియా బేగం నేతృత్వంలో మెరుగైన వైద్య సేవలు
  2. సూపర్‌వైజర్ విక్టోరియా రాణి పర్యవేక్షణలో ఇంటింటికీ మందులు
  3. ఆప్యాయంగా పలకరిస్తూ రోగులకు వైద్యం.. గ్రామస్తుల హర్షం
  4. టీబీ నిర్మూలనలో మూడు గ్రామాలకు పురస్కారాలు

నాగలిగిద్ద, అక్టోబర్ 11: పల్లె ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని చేరువ చేస్తూ నాగల్గిద్ద మండలంలోని పల్లె దవాఖానాలు(Village Clinics) ఆరోగ్య భరోసా(Health Assurance) కల్పిస్తున్నాయి. కరస్గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం నేతృత్వంలో, సూపర్వైజర్ విక్టోరియా రాణి పర్యవేక్షణలో కారముంగి, శేరి దామరగిద్ద, ఇరాక్పల్లి ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

సాధారణ వ్యాధుల చికిత్సతో పాటు గర్భిణులు, చిన్నారులు, దీర్ఘకాలిక రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గర్భిణులకు రక్తహీనత, రక్తపోటు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల సహకారంతో తల్లీబిడ్డల పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు బాధితులకు ఆశా కార్యకర్తల ద్వారా ఇంటి వద్దకే మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ సేవలు సకాలంలో అందేలా విక్టోరియా రాణి క్షేత్రస్థాయిలో సమన్వయం చేస్తున్నారు.

టీబీ నిర్మూలనలో మూడు గ్రామాలకు గుర్తింపు...

మండలంలో టీబీ నివారణకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అనుమానితులకు పరీక్షలు, బాధితులకు చికిత్సతో పాటు పోషకాహార కిట్లు అందిస్తున్నట్లు డాక్టర్ జువేరియా బేగం తెలిపారు. టీబీ ముక్త్ అభియాన్ కింద శేరి దామరగిద్ద, ముక్తాపూర్, కిషన్ నాయక్ తండా గ్రామ పంచాయతీలకు పురస్కారాలు లభించాయన్నారు. అక్టోబర్ 8న జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జెడ్పీ సీఈవో జానకిరెడ్డి చేతుల మీదుగా ఆయా గ్రామాల సర్పంచులు అవార్డులు అందుకున్నట్లు వివరించారు.

ఆప్యాయ పలకరింపుతో రోగులకు భరోసా...

మోడల్ స్కూల్ బాలికల వసతిగృహం, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు రక్తహీనత పరీక్షలతో పాటు జ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలకు చికిత్స అందించారు.

కారముంగి పల్లె దవాఖానాలో డాక్టర్ పూజా పాటిల్, శేరి దామరగిద్ద పల్లె దవాఖానాలో డాక్టర్ రాజశేఖర్రెడ్డి రోగులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆరోగ్య సమస్యలను ఓపికగా తెలుసుకుని నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండటంతో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి పల్లెకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని మండల వైద్యాధికారి డాక్టర్ జువేరియా బేగం తెలిపారు.

మరిన్ని వార్తలు