సౌదీపై హౌతీల దాడి.. భారతీయుడి మృతి
- దమ్మామ్ విమానాశ్రయంపై అర్ధరాత్రి దాడులు
- ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు
- నెల వ్యవధిలో దాడుల్లో 22 మంది మృతి, భారీ ఆర్థిక నష్టం
రియాద్, అక్టోబర్ 22: హౌతీలు(Houthi Attack) మరోమారు సౌదీ అరేబియా(Saudi Arabia)లోని దమ్మామ్లోని కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడులు చేశారు. బుధవారం అర్ధరాత్రి జరిపిన ఈ దాడిలో ఒక భారతీయుడితో సహా మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 8 మందికి గాయాలు కాగా అందులో ఇద్దరు భారతీయులున్నట్లు భారత రాయబార కార్యాలయం గురువారం వివరాలను వెల్లడించింది. ఈ దాడులపై విచారం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. సౌదీలోని చమురు, మౌలిక సదుపాయాలే లక్ష్యంగా హౌతీగ్రూప్ దాడులను తీవ్రతరం చేసింది. ఈ దాడితో విమానాశ్రయంలోని కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. దాడులపై నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు సౌదీ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో నెల వ్యవధిలో విమానాశ్రయాలపై జరిపిన దాడుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలకు ఈ గ్రూప్ ముప్పుగా పరిణమిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు సౌదీలోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.