ఉక్రెయిన్, ఇరాన్లో శాంతికి మద్దతు
- పోలాండ్, భారత్ మధ్య మరింత వ్యూహాత్మక భాగస్వామ్యం
- రక్షణ, అంతరిక్ష, అణుశక్తి రంగాలపై ప్రత్యేక దృష్టి
- 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపే లక్ష్యం
- ప్రధాని నరేంద్ర మోదీ
- పోలెండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్తో మోదీ కీలక భేటీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఉక్రెయిన్, ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధాలకు శాంతియుత పరిష్కారం లభించాలన్న భారత్ ఆకాంక్షను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మరోసారి స్పష్టం చేశారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్కోతో గురువారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించారు.
అదే సమయంలో భారత్- వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించా రు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మోదీ ప్రకటించారు. పెరుగుతు న్న ప్రపంచ అస్థిరత నేపథ్యంలో, రక్షణ, అంతరిక్ష, అణుశక్తి రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్, పోలాండ్ దేశాలు గురువారం అంగీకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు.
చర్చల అనంతరం మోదీ మాట్లాడుతూ, ఇరుపక్షాలు ప్రజాస్వామ్య విలువలను, చట్టబద్ధమైన పాలనను విశ్వసిస్తాయని, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రతి అర్థవంతమైన ప్రయత్నానికి భారత్ మద్దతు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో టస్క్ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్లో ఉన్నారు. ‘రక్షణ, అంతరిక్ష, అణుశక్తి రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి మనం అంగీకరించాం.
ఈ వ్యూహాత్మక రంగాలన్నింటిలోనూ భారత్తో కలిసి సహ- అభివృద్ధి, సహ- ఉత్పత్తిలో పాలుపంచు కోవాలని పోలాండ్ కంపెనీలను మేము ఆహ్వానిస్తున్నాం’ అని మోదీ అన్నారు. కీలక ఖనిజాలు, బొగ్గు వాయువు ఉత్పత్తి రంగాలలో కూడా పోలాండ్ నైపుణ్యంతో కొత్త భాగస్వామ్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. భారత్, పోలాండ్ల మధ్య స్నేహం కేవలం దౌత్య సంబంధాలపైనే కాకుండా, మాన వత్వం, కరుణ అనే ఉమ్మడి వారసత్వంపై కూడా ఆధారపడి ఉందన్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, జామ్నగర్, కొల్హాపూర్ రాజకుటుంబాలు వేలాది మంది పోలాండ్ పిల్లలకు, కుటుంబాలకు భారతదేశంలో ఆశ్రయం కల్పించాయి. 2022లో ఉక్రెయిన్ నుంచి మా విద్యార్థులు సురక్షితంగా తిరిగి రావడానికి పోలాండ్ మద్దతునిచ్చి, ఈ మానవతాస్ఫూర్తిని చాటిందని అన్నారు. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాల గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ‘ప్రపంచం అనిశ్చితి, మార్పుల కాలం గుండా వెళుతోంది.
ఇలాంటి సమయంలో కూడా, భారత్, పోలాండ్ రెండూ అభివృద్ధి, సాంకేతి కత, ఆవిష్కరణలకు ముఖ్యమైన కేంద్రాలుగా ఆవిర్భవిస్తున్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక బలం, భారత్ పోలాండ్ భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను సృష్టించిందని ప్రధాని చెప్పారు. ‘భారతదేశం,- యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఈ అవకాశాలను మరింత విస్తరించింది.
ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, భారతదేశం నుంచి పోలాండ్కు యంత్రాలు, రసాయనాలు, ప్లాస్టిక్లు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతులకు కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ‘అంతేకాకుండా, రైల్వేలు, రవాణా వ్యవస్థలు, అధునాతన తయారీ రంగాలు, ఆహార శుద్ధి, బయోటెక్నాలజీ వంటి రంగాలలో పోలాండ్ నుంచి కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తామని చెప్పారు. ప్రపంచం కోసం నమ్మదగిన సరఫరా గొలుసులను అభివృద్ధి చేయడంలో భారత్, పోలాండ్ కలిసి పనిచేస్తాయని, అలాగే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు.