ఫారం-6 వివాదం.. ఈసీకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ఫారం-6లో మార్పులు(Form 6 controversy) చేశారన్న ఆరోపణలు, ఈ అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) అనుమతి ఇచ్చిందంటూ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) విడుదల చేసిన ప్రకటన వివాదానికి దారితీశాయి. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
ఫారం-6లో ట్యాంపరింగ్ జరిగిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గురుస్వామి, అభిషేక్ మను సింఘ్వీ ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందనే భావన కలిగించేలా ఎన్నికల సంఘం ప్రెస్‌నోట్ విడుదల చేసిందని గురుస్వామి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో ఈ అంశంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI Justice Surya Kant) నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసిన విషయాన్ని కూడా పిటిషనర్లు ప్రస్తావించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని విచారణ సందర్భంగా సీజేఐ పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్లో తమ ఆరోపణలకు బలం చేకూర్చే అంశాలున్నాయని గురుస్వామి వాదించారు. ఈసీ అఫిడవిట్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సమయం కోరారు. మరోవైపు, తమ రిజాయిండర్ దాఖలు చేసేందుకు వారం రోజుల గడువు కావాలని ఎన్నికల సంఘం కోరింది. దీపావళి సెలవుల విరామాన్ని ఉపయోగించుకుని రిజాయిండర్ దాఖలు చేయాలని సీజేఐ సూచించినట్లు సమాచారం.
ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు, ఈసీ నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన ఇతర పిటిషన్లపైనా విచారణ వాయిదా పడింది. వివిధ రాజకీయ పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు నవంబర్ 17న విచారించనుంది. ఫారం-6 వివాదంలో ఎన్నికల సంఘం ఇచ్చే వివరణ, తదుపరి విచారణలో కోర్టు తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.