నిరసనలను అడ్డుకోవద్దు

12-10-2026 | 05:25am
  1. అక్రమ నిర్బంధాలను సహించబోం
  2. బారికేడ్లు తొలగించండి.. అత్యవసరమైన చోటనే కొనసాగించండి 
  3. ఆంక్షలు ఎత్తేయండి.. మెట్రో రాకపోకలు ఆపొద్దు
  4. ఇంటర్నెట్‌ను కూడా పునరుద్ధరించండి 
  5. ఢిల్లీ పోలీసులకు, కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
  6. రేపటిలోగా నివేదిక ఇవ్వాలని నోటీసులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ఎవరూ అడ్డుకోలేరని, అలా అడ్డుకునే చర్యలను సహించబోమని సుప్రీంకోర్టు(Supreme Court) తేల్చిచెప్పింది. నిరసనలు చేపట్టేవారు చట్టానికి లోబడి వ్యవహరించాలని, దాన్ని అతిక్రమించొద్దని సూచించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన బారికేడ్లను వెంటనే తొలగించాలని, అత్యవసరమైన చోట మాత్రమే కొనసాగించాలని అక్కడి పోలీసులకు స్పష్టం చేసింది.

నిషేధాజ్ఞలను ఎత్తివేయాలని, మెట్రోతోపాటు ఇతర రైళ్ల రాకపోకలను ఆపొద్దని తెలిపింది. వాటిని పునరుద్ధరించాలని సూచించింది. చట్టానికి తగ్గట్టు ఇంటర్నెట్ సేవలు కూడా కొనసాగించాలని స్పష్టం చేసింది. శనివారం సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో జర్నలిస్టులు, లాయర్లు, సాధారణ పౌరులను కూడా పోలీసులు నిర్బంధించారంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై ఆదివారం జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహన ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ ప్రత్యేకంగా విచారించింది. శనివారం నాటి పరిణామాలపై మంగళవారం నాటికి పూర్తి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. 

కోర్టుల చుట్టూ ఆంక్షలేంటి?

న్యాయస్థానాల చుట్టూ రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది సరైన పద్ధతి కాదని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ధర్మాసనం మందలించింది. న్యాయం పొందేందుకు ప్రజలు న్యాయస్థానానికి వస్తుంటారని, అలాంటిది వారికి భయాందోళనలు కలిగించేలా సుప్రీంకోర్టు పరిసరాల్లోనే ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించింది.

వెంటనే ఆంక్షలను తొలగించాలని ఆదేశించింది. ఢిల్లీ అంతటా ప్రజల రాకపోకలను సాధారణ స్థితికి తీసుకురావాలని.. శాంతిభద్రతలు అదుపుతప్పుతున్న చోట మాత్రమే అదీ అత్యవసరమైతేనే నియంత్రణ చర్యలు చేపట్టొచ్చని తెలిపింది. ‘నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. వారిని అక్రమంగా నిర్బంధించడం కరెక్ట్ కాదు.

నిరసనకారులు కూడా చట్టానికి లోబడి వ్యవహ రించాలి. లాయర్లు కూడా తమ ఆందోళనలు చట్టానికి అనుగుణంగానే కొనసాగిం చాలి’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 


మరిన్ని వార్తలు