దుకాణాల క్లోజింగ్‌.. హైకోర్టు సీరియస్

06-10-2026 | 10:13am

గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు (Meat Shops) మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన వ్యవహారంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. పాత కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

తార్నాకకు చెందిన న్యాయ విద్యార్థి వడ్ల శ్రీకాంత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఇదే అంశంపై ఆయన కోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టుకు తెలిపారు. స్లాటర్‌హౌస్‌లు, మాంసం దుకాణాల మూసివేతకు సంబంధించిన ఉత్తర్వులు జీహెచ్ఎంసీ చట్టం-1955 (GHMC Act) నిబంధనలకు అనుగుణంగా ఉండాలని గతంలో కోర్టు స్పష్టం చేసిందని వివరించారు. అయితే ఈ ఆదేశాలను పట్టించుకోకుండా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్లాటర్‌హౌస్‌లు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని సెప్టెంబర్ 30న జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసిందని వాదించారు.

నిబంధనలను గెజిట్‌లో (Gazette Notification) ప్రచురించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మాంసం దుకాణాల మూసివేత వ్యాపారుల ప్రాథమిక హక్కులను, ముఖ్యంగా ఆర్టికల్ 19(1)(g) (Fundamental Right)ను ఉల్లంఘిస్తుందని వాదించారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు రూ.50 వేల జరిమానా విధించాలని పిటిషన్‌లో కోరారు. వాదనలు విన్న హైకోర్టు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు