ఒకే వేదికపైకి

24-10-2026 | 05:15am
  1. ఏరోస్పేస్, అంతరిక్షం, రక్షణ, అంతర్గత భద్రత..
  2. రక్షా ఎక్స్‌పో రెడీ అవుతున్న ఫ్యూచర్ సిటీ
  3. ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లు
  4. నేడు ఫలక్‌నూమా ప్యాలెస్‌లో కర్టెన్ రైజర్ ప్రోగ్రాం
  5. 29న ఢిల్లీలో రక్షా ఎక్స్‌పో రోడ్ షో

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): రక్షణ పరిశోధన, రూపకల్పన, తయారీ రంగాల్లో స్వయం సమృద్ధి సాధించిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో తెలంగాణ రాష్ట్రం తన వంతు సహకారం అందించేందుకు సిద్ధమైంది. ఈ దిశగా ఏరోస్పేస్, అంతరిక్షం, రక్షణ, అంతర్గత భద్రతా రంగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ‘రక్షా ఎక్స్‌పో(Raksha Expo) శ్రీకారం చుడుతున్నది. హైదరాబాద్ శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ ఎక్స్‌పోను నిర్వహించనున్నారు.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ భాగంగా కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్నారు. దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తొలి రక్షణ, ఏరోస్పేస్ ఎక్స్‌పోగా.. అంతరిక్షం, అంతర్గత భద్రతా రంగాలను కూడా కలుపుకొని నిర్వహిస్తున్న తొలి సమగ్ర ప్రదర్శనగా ఇది ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఈ ఎక్స్‌పోకు సంబంధించిన ముందస్తు కార్యక్రమం (కర్టెన్ రైజర్) శనివారం హైదరాబాద్‌లోని ఫలక్‌నూమా ప్యాలెస్‌లో జరగనుంది.

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 70కి పైగా సంస్థలకు చెందిన 80 మందికి పైగా ప్రముఖులు హాజరవనున్నారు.  భారత వైమానిక దళ మాజీ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి (రిటైర్డ్), డీఆర్డీవో మాజీ చైర్మన్లు డాక్టర్  జీ సతీశ్ రెడ్డి, డాక్టర్ అవినాష్ చంద ర్, భారత్ ఫోర్జ్ ఛైర్మన్ బాబా కల్యాణి, బీడీఎల్, మిధాని, ఈసీఐఎల్, బీఈఎల్, ఏవీఎ న్‌ఎల్ సంస్థల అధిపతులు, సాయుధ దళా ల సీనియర్ కమాండర్లు కూడా పాల్గొననున్నారు. ఈ నెల 29న ఢిల్లీలో రక్షా ఎక్స్‌పోపై రోడ్‌షో నిర్వహించనున్నారు.

మారుతున్న యుద్ధ తంత్రాలకు తగ్గట్టు

‘రక్షా ఎక్స్‌పో’ విషయంలో రక్షణ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో రాష్ట్రం కీలక భాగస్వామిగా నిలవాల్సిన అవసరం ఉందని  సీఎం రేవంత్‌రెడ్డి విశ్వసిస్తున్నారు. ‘యుద్ధ స్వరూపం వేగంగా మారుతోంది. సంప్రదాయ యుద్ధ పద్ధతులు, వ్యూహాత్మక విధానాలతో పాటు డ్రోన్లు, ఆధునిక క్షిపణులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పులకు తెలంగాణ కేంద్రంగా ఎదగాలి. భారతదేశ జాతీయ భద్రత, అంతర్గత భద్రతను పరిరక్షించే ప్రయత్నాల్లో అత్యధిక సహకారం అందించే రాష్ట్రంగా తెలంగాణ నిలవాలి.

ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన వనరులు, అనుకూల తలు మనకు ఉన్నాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రక్షణ, అంతరిక్షం, ఏరోస్పేస్, అంతర్గత భద్రతా రంగాలు ‘తెలంగాణ రైజి ంగ్ దార్శనికతలో కీలక భాగమని తెలిపారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి చేర్చాలన్న లక్ష్య సాధనలోనూ ఈ రంగాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నారు. 

రక్షా పరమో ధర్మః

‘రక్షా ఎక్స్‌పో’ను ‘రక్షా పరమో ధర్మః’ అనే ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకొని నిర్వహించనున్నారు. వరంగల్ కాకతీయ కళాతోర ణం నుంచి గోల్కొండ కోట నిర్మాణ వైభ వం వరకు విస్తరించిన తెలంగాణ చారిత్రక వారసత్వం, రక్షణ, ఇంజినీరింగ్ సామర్థ్యాలకు ప్రతీకగా ఈ ఎక్స్‌పో  నిలువనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ, భారత్‌తోపాటు దాని భాగస్వామ్య దేశాల భద్రతకు తోడ్పడే వ్యూహాత్మక తయా రీ వ్యవస్థను నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.

ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు

రక్షా ఎక్స్‌పో రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు చెందిన ఉత్పత్తుల ప్రదర్శనలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు, డ్రోన్ షోలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9న వైమానిక ప్రదర్శన నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. వ్యాపార సంస్థలు, అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రభుత్వ ప్రతినిధులు, భద్రతా సంస్థలు, అంతర్జాతీయ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో అనుసంధానించేందుకు బీ2బీ, బీ2జీ సమావేశాలు నిర్వహిస్తారు. వీటి ద్వారా సరఫరా భాగస్వామ్యాలు, ఉ మ్మడి వ్యాపార సంస్థలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, స్వదేశీ సాంకేతిక అభివృద్ధిలో సం యుక్త భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించనున్నారు.

తయారీ, పరీక్షలు, ఏరోస్పేస్ నిర్వహణ, భద్రతా సాంకేతిక పరిజ్ఞానం వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించనున్నారు. ఫిక్కీ, అసోచామ్, సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరర్స్  వంటి పారిశ్రామిక సంఘాలతోపా టు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. ఈ కార్యక్రమం ప్రధానంగా రక్షణ, ఏరోస్పేస్ రంగాలకు సంబంధించినదని, బేగంపేటలో నిర్వహించే పౌర విమానయాన ప్రదర్శనకు ఇది భిన్నమైనదని నిర్వాహకులు స్పష్టం చేశారు.

రక్షణ మంత్రికి ఆహ్వానం

రక్షా ఎక్స్‌పోను ప్రారంభించాల్సిందిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి అధికారికంగా ఆహ్వానించారు. ఎక్స్‌పో ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజ య్ జాజు సమీక్షించారు. కార్యక్రమంలో అన్ని రంగాల భాగస్వామ్యం ఉండేలా, తగిన ప్రచారం కల్పించాలని ఆదేశించారు. 

హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం 

భారతదేశ వ్యూహాత్మక కార్యక్రమాలకు హైదరాబాద్ దశాబ్దాలుగా అండగా నిలుస్తున్నది. క్షిపణులు, యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, సురక్షిత సమాచార వ్యవస్థల అభివృద్ధిలో నగరం కీలక పాత్ర పోషించింది. దేశంలోని రక్షణ, ఏరోస్పేస్ పరిశ్రమలో దాదాపు 30 శాతం వాటా హైదరాబాద్‌లోనే ఉంది. ఇప్పటివరకు విడివిడిగా ఉన్న ఈ సామర్థ్యాలన్నింటినీ రక్షా ఎక్స్ పో ద్వారా ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాం. అంతరిక్షం, అంతర్గత భద్రతా రంగాలను కూడా ఇందులో చేర్చాం. ఎందుకంటే భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లు ఈ నాలుగు రంగాలకు సంబంధించినవిగా ఉంటాయి. ఈ ఎక్స్‌పో కేవలం ప్రదర్శనలకు పరిమితం కాకుండా.. వ్యాపార భాగస్వామ్యాలు, సాంకేతిక సహకారాలకు వేదికగా రూపొందుతున్నది. 

ప్రధాన కార్యదర్శి

సంజయ్ జాజు

మరిన్ని వార్తలు