తల్లి మరణం తర్వాత యోగి పాత జ్ఞాపకం

23-11-2026 | 09:47am

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) తన తల్లితో ఉన్న ఓ అరుదైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. సన్యాసం స్వీకరించిన మూడేళ్లకు కాషాయ వస్త్రాలు ధరించి ఇంటికి వెళ్లినప్పుడు.. తన గొంతు విని బయటకు వచ్చిన తల్లి, ఎదురుగా ఉన్నది తన కొడుకేనని మొదట నమ్మలేకపోయిందని వెల్లడించారు.

ఇటీవల తన తల్లి సావిత్రీ దేవి(Yogi Mother Savitri Devi) మరణంతో ఆమె జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ యోగి ఆదిత్యనాథ్ 'అమ్మకు లేఖ' పేరుతో ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఇందులో తన సన్యాస జీవితంలోని కీలక ఘట్టాన్ని వివరించారు. సన్యాసం స్వీకరించిన తర్వాత తొలిసారిగా మూడేళ్లకు పైగా వ్యవధి అనంతరం ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామం పంచూర్‌కు వెళ్లినట్లు తెలిపారు. ఆ సమయంలో కాషాయ వస్త్రాలు ధరించి ఇంటి గడప బయట నిలబడి తల్లిని భిక్ష అడిగానని చెప్పారు. తన పిలుపు విని బయటకు వచ్చిన తల్లి.. తన వేషధారణ చూసి ఆశ్చర్యపోయిందని గుర్తుచేసుకున్నారు.

'ఇంట్లో ఏం తక్కువైందని ఇలా భిక్ష అడుగుతున్నావు?' అని తల్లి ప్రశ్నించగా.. సన్యాసం(Sanyam) తన ధర్మమని, యోగి ఆకలి భిక్షతోనే తీరుతుందని సమాధానమిచ్చినట్లు తెలిపారు. తాను ఇంట్లో ఉండటానికి రాలేదని, సన్యాస సంప్రదాయం ప్రకారం భిక్ష తీసుకోవడానికే వచ్చానని తల్లికి వివరించారట. చివరకు కొడుకు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ తల్లి అతడికి భిక్ష ఇచ్చిందని యోగి వెల్లడించారు.

తల్లి తనకు తొలి గురువని, అక్షర జ్ఞానంతో పాటు జీవిత విలువలను నేర్పించిందని గుర్తుచేసుకున్నారు. అమ్మ లేని లోటు కేవలం ఒక మనిషి దూరం కావడం మాత్రమే కాదని, నిస్వార్థ ప్రేమ, ఆత్మీయత, భద్రతను కోల్పోవడమేనని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిరాశ్రయులైన తల్లులకు అండగా నిలవాలని, అవసరంలో ఉన్న తల్లుల బాధను అర్థం చేసుకుని వారి ముఖాల్లో చిరునవ్వు తీసుకురావాలని ప్రజలకు యోగి పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు