రోజుకు 100 కి.మీ.. సైకిల్‌పై డెలివరీ
బెంగళూరు: పట్టుదల ముందు కష్టాలు కూడా తలవంచాల్సిందేనని తమిళనాడుకు చెందిన పార్థీబన్ కృష్ణమూర్తి(Parthiban Krishnamoorthy) నిరూపించాడు. ఒకప్పుడు సైకిల్‌పై ఆర్డర్లు డెలివరీ(Orders delivery) చేసిన అతడు.. ఇప్పుడు ప్రముఖ ఆడిట్ సంస్థ BDOలో ఆర్టికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడి ప్రయాణం ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది.
కాంచీపురానికి చెందిన పార్థీబన్ కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనే లక్ష్యంతో చదువు ప్రారంభించిన అతడికి CA ఇంటర్మీడియట్లో వరుసగా రెండుసార్లు ఎదురుదెబ్బ తగిలింది. అయినా లక్ష్యాన్ని వదులుకోలేదు. ఆర్థికంగా కుటుంబంపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో బెంగళూరు(Bangalore)కు వెళ్లి ఉద్యోగం వెతుక్కున్నాడు.
మొదట జెప్టో స్టోర్‌లో రాత్రి వేళల్లో ఆర్డర్ ప్యాకింగ్ పని చేశాడు. ఆ తర్వాత బ్లింకిట్‌లో సైకిల్ డెలివరీ పార్ట్నర్గా చేరాడు. నెలకు రూ.600 అద్దెతో సైకిల్ తీసుకుని, కొన్ని రోజుల్లో దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించేవాడు. డెలివరీల మధ్య దొరికే విరామంలో యూట్యూబ్ ద్వారా CA పాఠాలు నేర్చుకునేవాడు.
చివరకు అతడి శ్రమ ఫలించింది. 2026 మార్చి 8న CA ఇంటర్మీడియట్ రెండు గ్రూపుల్లోనూ ఉత్తీర్ణత సాధించి CA ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఆ తర్వాత నాలుగు సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరుకాగా, మూడు సంస్థల నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఏప్రిల్ 2న బెంగళూరులోని BDO సంస్థలో ఆర్టికల్ అసిస్టెంట్‌గా చేరాడు.
విశేషమేమిటంటే.. గతంలో జెప్టోలో పనిచేసే సమయంలో ఎదురుగా కనిపించే BDO కార్యాలయాన్ని చూసి అక్కడ ఉద్యోగం చేయాలని కలలు కనేవాడు. డెలివరీల మధ్య సమయం దొరికినప్పుడు ఆ కార్యాలయం వెనుక పార్కులో విశ్రాంతి తీసుకునేవాడు. ఇప్పుడు అదే సంస్థలో ఉద్యోగిగా అడుగుపెట్టాడు. CA ఫైనల్ పరీక్షలు ఇంకా పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, అతడి ప్రయాణం మాత్రం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది.