నేడు కేఆర్ఎంబీ కీలక భేటీ.. పల్నాడు ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం
హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి కీలక చర్చకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్లోని జలసౌధలో సోమవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. నాగార్జునసాగర్(Nagarjuna Sagar) నుంచి అదనపు నీటిని విడుదల చేయాలన్న ఏపీ ప్రతిపాదనతో పాటు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు(Palnadu Water Grid project)పై తెలంగాణ అభ్యంతరాలు ఈ భేటీలో ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు నెలల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి 9 టీఎంసీల నీటిని కోరింది. ఇందులో కుడి కాలువ ద్వారా 8 టీఎంసీలు, ఎడమ కాలువ ద్వారా మరో టీఎంసీ విడుదల చేయాలని ప్రతిపాదించింది. అయితే సాగర్ జలాలను తరలించేందుకు ఏపీ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్(Palnadu Water Grid) పనులకు అనుమతులు, తెలంగాణ ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.
కేఆర్ఎంబీని కలవనున్న బీఆర్ఎస్
మరోవైపు, నాగార్జునసాగర్ నీటి నిల్వలు, హైదరాబాద్ భవిష్యత్తు తాగునీటి అవసరాల అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోమవారం కేఆర్ఎంబీ అధికారులను కలవనుంది. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో కూడిన బృందం బోర్డుకు వినతిపత్రం సమర్పించనుంది.
పల్నాడు వాటర్ గ్రిడ్ నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, నీటి కేటాయింపులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలను పరిశీలించాలని బోర్డును కోరనుంది. సాగర్ జలాల విషయంలో తెలంగాణ హక్కులకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నష్టం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేయనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీకి అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో సోమవారం జరిగే సమావేశం కీలకంగా మారింది. ఏపీ అదనపు నీటి అభ్యర్థనపై, పల్నాడు ప్రాజెక్టుపై బోర్డు ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.