ఈసారి భారీ మెజార్టీ లక్ష్యం
- రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావాలి
- ఆ దిశగా నేతలంతా కలిసి పనిచేయాలి
- కేంద్రంలోనూ కాంగ్రెస్‌ను పవర్‌లోకి తెచ్చుకుందాం
- రాహుల్‌ను ప్రధానమంత్రిని చేసుకుందాం
- పీసీసీ పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్ పిలుపు
- ఈ నెల 26న హైదరాబాద్‌లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): గత ఎన్నికల్లో నాయకులందరూ సమిష్టిగా పనిచేయడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి(Congress Party in power) వచ్చిందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జి బీఎం సందీప్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 64 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నామని.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయాలు సాధించామని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో మరింత మెజార్టీతో ఎక్కువ స్థానాలు సాధించేలా పార్టీలోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ పీఏసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా సందీప్ తొలిసారి హాజరయ్యారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో వాటిని అధిగమిస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందించడం లేదని బీఎం సందీప్ మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా ప్రజల అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనితీరు దేశంలోని ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నదని తెలిపారు. గతంలో రాష్ట్రంలో పార్టీ ఇన్‌చార్జులుగా పనిచేసిన ఏఐసీసీ నేతలు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. వారి కృషిని కొనసాగిస్తూ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని తిప్పికొట్టాలి
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకునేందుకు పార్టీ శ్రేణులు మరింత కష్టపడాలని బీఎం సందీప్ పిలుపునిచ్చారు. సోనియాగాంధీ రచించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకానికి దేశవ్యాప్తంగా ప్రాధాన్యం లభించిందని పేర్కొన్నారు. సోనియాగాంధీ చేసిన త్యాగాలు, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలిదానాలు దేశ ప్రజల మనసుల్లో నిలిచిపోయాయని అన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని రాజకీయంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు సందీప్ పిలుపునిచ్చారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు సచిన్ సావంత్, జెట్టి కుసుమకుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
26న రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ: పీసీసీ చీఫ్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీగా మీనాక్షి నటరాజన్ ఎంతో కృషి చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కొత్త ఇన్‌చార్జి సందీప్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు ఆయన పీఏసీ సమావేశంలో పిలుపునిచ్చారు.
కేంద్ర విధానాలతో తెలంగాణకు ఎక్కువ నష్టం జరుగుతున్నదన్నారు. ఈ నెల 26న రాజ్యాంగ పరిరక్షణ పేరుతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ గెలవాలన్నారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవాలని, దాని కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు.