కమలం.. 3ఎం
మాదిగ, ముదిరాజ్, మున్నూరుకాపు ఓటు బ్యాంకుపై బీజేపీ ఫోకస్
- రాష్ట్ర జనాభాలో ఈ మూడు సామాజికవర్గాల వాటా 21.58 శాతం
- గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యా బలం
- ఈ మూడు వర్గాలను ఆకట్టుకునేలా ప్రణాళిక
- పార్టీ పదవులు, రాజకీయ అవకాశాల్లో పెద్దపీట
- తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సరికొత్త ఫార్ములా
- త్వరలోనే జాతీయ స్థాయి నేతల వరుస పర్యటనలు
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణలో(Telangana) అధికారమే లక్ష్యం గా బీజేపీ సరికొత్త ఫార్ములాకు(BJP's new formula) తెరతీసింది. మాదిగ, ముదిరాజ్, మున్నూరు కాపు సామాజిక వర్గాలను కేంద్రంగా చేసుకుని ‘3ఎం’ వ్యూహాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర జనాభాలో 21.58 శాతం వాటా ఉన్న ఈ మూడు వర్గాలకు రాజకీయంగా మరింత చేరువ కావడం, వారికి పార్టీ పదవులు, భవిష్యత్తులో రాజకీయ అవకా శాల్లో ప్రాధాన్యం కల్పించడం ద్వారా సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయం గా ఎదిగేందుకు తెలంగాణను ప్రాధాన్య తా రాష్ర్టంగా పరిగణిస్తున్న కేంద్ర నాయకత్వం.. ఈ వ్యూహంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమగ్ర కులగణన ప్రకారం రాష్ట్ర జనాభా లో ఈ మూడు సామాజిక వర్గాలు దాదా పు 76.71 లక్షల మంది. అంటే సుమారు 21.58 శాతం మంది.
వీరిలో మాదిగలు 36.58 లక్షల మంది, అంటే జనాభాలో 10.3 శాతం ఉన్నారు. ముదిరాజ్‌లు 26.39 లక్షలు, అంటే 7.4 శాతం, మున్నూరు కాపులు 13.75 లక్షల మందితో 3.9 శాతం ఉన్నారు. ఈ మూడు వర్గాలు పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయనున్నారని వ్యూహకర్తలు భావిస్తున్నారు. వీరి మద్దతును కూడగట్టేందుకు బీజేపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
అమిత్‌షా డైరెక్షన్లోనే..
‘3ఎం’ వ్యూహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో రూపొందించిన పలు నివేదికలు, రహస్య సర్వేల ఆధారంగా ఈ వ్యూహాన్ని రూపొందించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన సామాజిక సమీకరణ నమూనాలను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా వ్యూహంలో భాగంగా తొలి సంస్థాగత అడుగుగా మాస్టర్ స్ట్రాటజిస్ట్, ఎన్నికల నిర్వహణ నిపుణుడు సునీల్ బన్సల్‌ను తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా బీజేపీ నియమించింది.
బన్సల్ ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయడంతో పాటు పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి దశలో భారీ ప్రజా సమీకరణపై దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై వారిలో చైతన్యం, అవగాహన పెంచాలనుకుంటున్నారు. ఇందుకు ‘నషా ముక్త్ భారత్’, వాకథాన్, పాదయాత్రల పేరుతో పార్టీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్లో లక్ష మంది పాల్గొనే బీజేపీ మహాపాదయాత్రలో పాల్గొంటున్నారు.
మెదక్‌లో ఇదే తరహా భారీ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించనున్న హైదరాబాద్ వాక్ యాత్రకు సినీ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్‌తోపాటు డైరెక్టర్లు సుకుమార్, బోయపాటి శ్రీను వంటి ప్రముఖ సినీ నటులను స్వయంగా ఆహ్వానించారు.
ఆపరేషన్ ఆకర్ష్కూడా..
మొదటి దశలో బీఆర్ఎస్ నుంచి ప్రముఖ నేతలను, కార్యకర్తలను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు దగ్గర పడే కొద్దీ చేరికలపై దృష్టి పెట్టనున్నారు. మాదిగ, ముదిరాజ్, మున్నూరు కాపు వర్గాలకు పార్టీలో ప్రాముఖ్యత కల్పించనున్నారు. ఇప్పటికే కొందరి నేతలకు రాష్ట్ర నాయకత్వంలో ఆ గుర్తింపును కూడా ఇచ్చారు. యువ ఓటర్లను ప్రభావితం చేయడానికి, పార్టీని మరింత విస్తరించడానికి అమిత్ షా హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో ఇప్పటికే సమావేశాలు జరిపారు.
రాష్ట్రానికి రానున్న నేతలు
ఈ వారంలో రాష్ట్రానికి జాతీయ స్థాయి నేతలు క్యూ కట్టనున్నారు. వీరంతా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనున్నారు. నవంబర్ 23న నితిన్ నబీన్ కరీంనగర్లో పార్టీ ‘సేవ్ డెమోక్రసీ’ ప్రచారంలో భాగంగా పాదయాత్రకు నాయకత్వం వహించనున్నారు. మున్నూరు కాపు, మాదిగ వర్గాల ప్రాబల్యం గణనీయంగా ఉన్న ఉత్తర తెలంగాణ నుంచి ఈ పాదయాత్రకు భారీ స్పందన వస్తుందని భావిస్తున్నారు.
కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. అమిత్ షా నవంబర్ 24న హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఆ తర్వాత నవంబర్ 25న సిద్దిపేటలో పాదయాత్ర జరగనుంది. ఈ వరుస పర్యటనలు, కార్యక్రమాల ద్వారా రాజకీయ వేడిని పెంచ డం, అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము గట్టి సవాల్ విసురుతున్నామనే సంకేతం ఇవ్వడమే ఈ కార్యక్రమాల ఉద్దేశమని తెలుస్తోంది.
ఆ వర్గాలకు అవకాశాలు కల్పించేలా..
మాదిగ సామాజిక వర్గం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఎక్కువ ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేస్తోందని రాజకీయ పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలు కొన్ని వర్గాలకే అసమానంగా అందుతున్నాయని వారు వాదిస్తున్నారు. చేపల వేట, దాని కి అనుబంధ జీవనోపాధులతో సంప్రదాయంగా ముడిపడి ఉన్న ముదిరాజ్ వర్గం, పలు జిల్లాల్లో ప్రభావం కలిగిన మున్నూరు కాపు వర్గం కూడా బలమైన రాజకీయ గొంతు కోసం ఎదురు చూస్తున్నాయి.
ఈ వర్గాలను చేరువై, ప్రోత్సహించి, అవకాశాలు కల్పించి వారి సంఖ్యా బలాన్ని ఎన్నికల బలంగా మార్చుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం 3ఎం ఫార్ములా చాలా కీలకం. ఓటింగ్ సరళిని వివరంగా విశ్లేషించడం, ప్రతి సామాజిక వర్గంలో స్థానిక ప్రభావితం చేయగల నేతలను గుర్తించడం, కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల మధ్య పక్కా సమన్వయం ఇందులో భాగంగా చెప్తున్నారు.