24 August, 2026 | 3:59 AM

మట్టిబొమ్మ.. మరబొమ్మ!

24-08-2026 12:00 AM

మట్టి నుంచి పుట్టుకొచ్చి

మరబొమ్మను చేసిన మనిషీ!

ఏదిరా నీ మహత్తు?

ఎక్కడుంది నీ విముక్తి?

గుండె ఉండీ

గుండె చచ్చిపోయిన మట్టి బొమ్మవు నువ్వు!

గుండె లేక...

గుండెలా పని చేసే మరబొమ్మ అది!

రుధిరం పారే శారీరం నీది

ఆయిల్ తాగే శరీరం దానిది.

కన్నీరు కార్చే కళ్లు నీవి

నేత్ర బిందువు ఎరుగని

చిత్ర గ్రాహక కళ్లు దానివి

భావోద్వేగాల బతుకు నీది

శూన్య భావాల సైకత శిల్పం దానిది

అనుబంధాల ఆప్యాయతల హరివిల్లు నీది

ఆత్మ ఎరుగని ఆల్గారిథం దానిది!

తలవంచి బతికే మట్టి ప్రతిమవు నువ్వు

తలయెత్తి శాసించే లోహపు బొమ్మ అది

పని చేసి చేసి..

పస్తులుండే ప్రాణివి నువ్వు

పని లేకుండానే..

ఛార్జింగ్ పొందే యంత్రమది 

మనిషి స్థానంలో రోబో కూర్చుంది

రోబో కాళ్ల దగ్గర మనిషి సాగిలపడ్డాడు

రోబోను సృష్టించిన బ్రహ్మ నువ్వే గానీ..

ఈ శతాబ్దపు అతి పెద్ద బిచ్చగాడివీ నువ్వే

ఆవిష్కరించిన విక్రమార్కుడివే గానీ..

నీ భుజాన ఎక్కిన భేతాళమే ఆ మరబొమ్మ!

ఓ మట్టిబొమ్మా!

మరబొమ్మను చూసి మురిసిపోకు

అది నిన్ను మింగేయక ముందే

నీలోని ‘మనిషిని’ మళ్లీ ఒకసారి తవ్వుకో!

 దుప్పటి మొగిలి