ప్రజాస్వామ్యబద్ధంగా అసెంబ్లీ

19-09-2026 | 05:05am
  1. సభను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ ప్లాన్ 
  2. స్పీకర్‌ను దూషించడం బాధ కలిగించింది
  3.   105 మంది సభ్యులకు మాట్లాడే ఛాన్స్   
  4. ‘దానం’ అంశంపై కోర్టు  కాపీ వచ్చాక స్పందిస్తాం 
  5. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశాలను(Assembly meetings) ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించామని, అన్ని పార్టీల సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చామని మంత్రి శ్రీధర్‌బాబు(Sridhar Babu) తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం(Development and Welfare)పై సభలో విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. శుక్రవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్ సభ్యులే సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నిం చారని విమర్శించారు.

సభ నియమావళిని ఉల్లంఘిస్తే స్పీకర్ సస్పెండ్ చేస్తారని తెలిసి కూడా నినాదాలతో కూడిన బ్లాక్ టీషర్టులు(Black Tshirts) ధరించి వచ్చారని పేర్కొన్నారు. పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారని, స్పీకర్ అప్పీల్ చేసినప్పటికీ సభలో ఉండొద్దన్న ఉద్దేశంతోనే సభ కార్యకలాపాలను అడ్డుకున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్పీకర్‌ను దూషించడం బాధ కలిగించిందన్నారు.

‘మొత్తం ఎనిమిది రోజులు 51. 52 గంటలు సభ జరిగింది. 50 ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. 86 మంది సభ్యులు సప్లమెంటరీ ప్రశ్నలు అడిగారు. 105 మంది సభ్యులు సభలో వివిధ అంశాలపైన మాట్లాడారు. ఇద్దరు మంత్రులు స్టేట్‌మెంట్  ఇచ్చారు. నాలుగు బిల్లులను పాస్ చేసుకున్నాం. నాలుగు అంశాలపైన స్వల్పకాలిక చర్చ సభలో జరిగింది. పలు బిల్లులను ఆమోదించుకున్నాం’ అని మంత్రి వెల్లడించారు.

22 ఏపై సమగ్ర వివరణ ఇచ్చాం.. 

22-ఏ నిషేధిత భూములపై ప్రతిపక్షం చేసిన రాద్ధాంతం పైన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy),  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy)  ప్రజలకు సమగ్రంగా వివరణ ఇచ్చారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం హైపవర్ ఆఫీషియల్ కమిటీ  ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని తెలిపారు.

ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వారి అనుభవంతో సలహాలు, సూచనలు ఇస్తారని భావించామని, సభకు రమ్మని వారికి విజ్ఞప్తి చేశామని స్పష్టం చేశారు. మహిళా పోలీసులు, పోలీసులపైన బీఆర్‌ఎస్ సభ్యులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. బీఆర్‌ఎస్ సభ్యుల తీరుతో స్పీకర్ తీవ్ర మనస్తాపం చెందారని, అయినా సభను హుందాగా నడిపించారంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

గౌరవప్రదమైన సభను మాక్ అసెంబ్లీతో హాస్యస్పదం చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నేతల భూ వ్యవహారాల్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినందునే కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్ర పరిశీలనకు వెళ్లారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామనే భ్రమలో బీఆర్‌ఎస్ ఉందని, సాధ్యమయ్యేది కాదని  శ్రీధర్‌బాబు విమర్శించారు. 

సభకు రావాలన్న చిత్తశుద్ధి బీఆర్‌ఎస్‌కు లేదు

‘అసెంబ్లీని రెండు నెలలు జరపాలని మాట్లాడిన కేటీఆర్.. కనీసం తమ పైన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరలేదు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలన్న చిత్తశుద్ధి కూడా వాళ్లకు లేదు. బీఆర్‌ఎస్ సభ్యుల ప్రవర్తన గత సమావేశాల్లో మాదిరిగానే ఉంది. వారి తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు అనేక విషయాలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు బీఆర్‌ఎస్ నేతలు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. ప్రభుత్వమే ముందుకు వచ్చి 22-ఏ అంశంపై సభలో చర్చ చేపట్టింది. 22-ఏ పైన హైపవర్ ఆఫీషియల్ కమిటీ వేశాం. కమిటీ పరిశీలన తర్వాత నిర్ణయం ఉంటుంది. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు తీర్పు కాపీ వచ్చాక అధికారికంగా స్పందిస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు