ధైర్యం ఉంటే సవాల్‌కు రండి!
- 22ఏ సమస్యలు పరిష్కరించండి
- కాంగ్రెస్‌వి బూటకపు యాత్రలు
- ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం
- ముందు చెబితే తిండి పెట్టి తోటంతా తిప్పేవాన్ని
- ఎంపీల పర్యటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
సిద్దిపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): ప్రజా సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ పార్టీ(Congress Party) డైవర్షన్ పాలిటిక్స్(Diversionary politics)కు పాల్పడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) విమర్శించారు. తన వ్యవసాయ భూమి(Agricultural land) విషయంలో కాంగ్రెస్ ఎంపీల బృందం సిద్దిపేటకు రావడం రాజకీయ కక్షసాధింపులో భాగమేనని ఆరోపించారు. ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని, తన భూమిలో ఒక్క చిన్న తప్పు ఉన్నా మొత్తం 13 ఎకరాలను ప్రభుత్వానికి రాసిచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) తీరుపై మండిపడ్డారు. దొంగే దొంగాదొంగ అని అరిచినట్లుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో భూములను చేర్చి లక్షలాది కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం, ఆ సమస్యను పరిష్కరించకుండా ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగుతోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలోనే అధికారులు హడావుడిగా భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లు చెప్పారని పేర్కొన్నారు. సిద్దిపేట పరిధిలోని రంగధాంపల్లి, ఎన్‌సాన్‌పల్లి, మిట్టపల్లి, పొన్నాల తదితర ప్రాంతాల్లో వేలాది ఇళ్ల ప్లాట్లు 22ఏ సమస్యలో చిక్కుకున్నాయని అన్నారు. ఎంపీల బృందానికి మంచిగ కడుపు నిండ అన్నం తినిపించి దగ్గరుండి కంటినిండా తోట అంతా చూపిద్దామనుకున్నా, 22ఏ బాధితులను కూడా చూపించాలనుకున్నా.. అని పేర్కొన్నారు. తన వ్యవసాయ భూమిలో విలాసవంతమైన ఫాంహౌస్ కాదు కదా.. కనీసం బాత్రూం కూడా లేదన్నారు.
2018 నుంచి 2024 వరకు విడతల వారీగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని, సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయని తెలిపారు. తానే స్వయంగా ఆర్డీవో, కలెక్టర్, సర్వే అధికారులకు లేఖలు రాసి హద్దులు చూపించాలని కోరానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తహసీల్దార్, సర్వేయర్ వచ్చి భూమిని సర్వే చేశారని, రిజిస్ట్రేషన్‌లో 13 ఎకరాల 12 గుంటలు ఉంటే స్వాధీనంలో 13 ఎకరాల 10 గుంటలే తేలిందన్నారు.
నా భూమి కొనుగోలులో ఒక్క చిన్న తప్పు ఉందని నిరూపించినా మొత్తం భూమిని ప్రభుత్వానికే వదిలేస్తానని హరీశ్‌రావు సవాల్ చేశారు. తన ఆస్తుల వివరాలను ప్రతి ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించానని, ప్రజలకు అన్నీ తెలిసే తనను ఎన్నుకున్నారని అన్నారు. ప్రతిపక్షం సభలో ఉంటే ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తమను అసెంబ్లీ సస్పెండ్ చేశారని ఆరోపించారు.
సిద్దిపేట అభివృద్ధిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం
కాంగ్రెస్ ఎంపీల బృందం సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా పట్టణంలోని ప్రజా సమస్యలను చూపించాలని తాను భావించినట్లు హరీశ్‌రావు తెలిపారు. వెయ్యి పడకల ఆసుపత్రి పనులు నిలిచిపోయాయని, నర్సింగ్ కాలేజీ పనులు, రంగనాయకసాగర్ వద్ద ప్రతిపాదిత టూరిజం ప్రాజెక్టు తదితర అంశాలను వారికి చూపించాలనుకున్నానన్నారు. రోడ్ల దుస్థితి, సాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరా, రైతుల ఇబ్బందులను కూడా ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని భావించినట్లు తెలిపారు.
దండయాత్రలు కేంద్రంపై చేయండి
రాష్ట్ర హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడాలని కాంగ్రెస్ ఎంపీలకు హరీశ్‌రావు సూచించారు. కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టులు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో ఫేజ్- 2, పాలమూరు ఎత్తిపోతలు, సీతమ్మసాగర్ తదితర అంశాలపై కేంద్రంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు. రాజకీయ కక్షసాధింపు కోసం యాత్రలు చేయడం కాదు.. తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై దండయాత్ర చేయాలని సూచించారు.
దళితుల భూములపై సీఎం సవాల్ స్వీకరిస్తారా?
కేసీఆర్ దళితుల భూములను కబ్జా చేశారంటూ హడావుడి చేసి చివరకు వాస్తవాలు బయటపెట్టలేదని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ వద్ద దళితుల భూములు లేవని తేలితే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమా? మేము మాత్రం రాజీనామాకు సిద్ధం అని సవాల్ విసిరారు. రైతులకు విద్యుత్, సాగునీరు, రుణమాఫీ, 22ఏ భూముల సమస్య, యువత, మహిళలు, ఆటో డ్రైవర్లు తదితర వర్గాలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం.. అని హెచ్చరించారు.