పశుక్రాంతిలో నం.1 దేవాయిపల్లి!

19-09-2026 | 05:20am
  1. రోజు 1000 నుంచి 1200 లీటర్ల పాల ఉత్పత్తి
  2. నెలకు రూ.5 లక్షల చెల్లింపులు
  3. పాలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు
  4. పాడి రైతులకు ప్రోత్సాహాకాలు అందించాలి
  5.  పాల ధరను పెంచాలి రైతుల డిమాండ్

తాడ్వాయి, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): గతంలో పాల ఉత్పత్తి(Milk production)కి పేరుగాంచిన తాడ్వాయి మండలం(Tadwai Mandal) ప్రస్తుతం పాల ఉత్పత్తి లేక వెలవెలబోతుంది. పాడి రైతుల(Dairy farmers)కు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు.కనీసం గ్రామంలో ప్రజలకు తాగడానికి సైతం సరిపోయే పాలు దొరకడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. గతంలో వేల లీటర్ల పాల ఉత్పత్తి జరిగేది. ప్రస్తుతం పాల ఉత్పత్తి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.పాల ధరను పెంచితే రైతులు(Farmers) తిరిగి పాల ఉత్పత్తి వైపుకు మరలే అవకాశం ఉంది.

ప్రభుత్వం పాల ధరను పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో,జిల్లాలో పాల ఉత్పత్తిలో ప్రత్యేక స్థానాన్ని పొందుపరచుకున్న తాడ్వాయి మండలం నేడు పాల ఉత్పత్తి లేక కొనుక్కునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం దేవాయిపల్లి పశుక్రాంతి పథకంలో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. అప్పట్లో దేవాయిపల్లి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడిగా పైడి రాజేశ్వర్ రెడ్డి బాధ్యతలు నిర్వహించారు.

ఆయన గ్రామంలో పాల ఉత్పత్తి పెంచి రైతులకు మంచి ఆదాయం రావాలి అనే సంకల్పంతో అప్పటి ప్రభుత్వం 2008,2009 సంవత్సరాలలో ప్రత్యేకంగా ప్రారంభించిన పశుక్రాంతి పథకాన్ని వినియోగించుకున్నారు.పశుక్రాంతి పథకాన్ని ఉపయోగించుకొని ప్రతి రైతుకు లాభం వచ్చేటట్లు తన వంతు చర్యలు తీసుకున్నారు.

పశుక్రాంతిలో 120 ఆవులు కొనుగోలు..

పశుక్రాంతి పథకంలో ఒక్క దేవా యిపల్లి గ్రామంలో 120 ఆవులు కొనుగోలు చేశారు. రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలనే సంకల్పంతో పాల కేంద్రం అధ్యక్షుడు అయిన రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని అధికారులతో మాట్లాడి పశుక్రాంతి పథకంలో గ్రామానికి ఎక్కువ ఆవులు వచ్చేలా కృషి చేశారు.దీంతో దేవాయిపల్లి గ్రామం జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

పశుక్రాంతిలో రైతులకు లబ్ది..

పాల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో రైతుకు ఒక ఆవు లేదా రెండు ఆవులు అందించింది. దీనిలో ఆవులు లేదా గేదెలు తీసుకోవచ్చు. ఈ పథకంలో ఒక ఆవుకు రూ.50 వేలు ధర కాగా, అందులో ప్రభుత్వం 50 శాతం రాయితీని అందించింది. ఇందులో రైతు కేవలం రూ. 25 వేలు చెల్లిస్తే ఈ పథకం ద్వారా ఆవును అందించారు. రైతులు చెల్లించే రూ.25 వేల రూపాయలు సైతం బ్యాంకు నుంచి రైతులకు రుణం రూపంలో అందించి ఆవులను కొనుగోలు చేశారు.దేవాయిపల్లి పశుక్రాంతి పథకాన్ని వినియోగించుకోవడంలో మొదటి స్థానంలో నిలవడంతో అప్పటి కలెక్టర్ సునీత, పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ తిరుపతయ్య లు ప్రత్యేకంగా గ్రామానికి విచ్చేసి పశువులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. 

 రోజు 1000 నుంచి 1200 పాల లీటర్ల ఉత్పత్తి 

దేవాయిపల్లిలో పశుక్రాంతి పథకం ద్వారా వచ్చిన ఆవులతో రోజు 1000 నుంచి  1200 లీటర్ల పాలు సేకరించారు.నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల డబ్బులు రైతులకు పంపిణీ జరిగేది.దీంతో రైతులు మంచి ఆధాయం పొంధే వారు. ప్రస్తుతం పాల ధర తగ్గడం తో రైతులు పాడి ఆవులు గేదెలు పెంచుకోవడం లో ఆసక్తి చూపడం లేదు.

పూర్తిగా పడిపోయిన పాల ఉత్పత్తి 

గతంలో ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కానీ ప్రస్తుతం పాల ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆధరణ లేకపోవడంతో పూర్తిగా ఉత్పత్తి పడిపోయింది. దేవాయిపల్లి గ్రామంలో ప్రస్తుతం రోజు 80 నుంచి 100 లీటర్ల పాల ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. ప్రభుత్వం స్పందించి పాల ఉత్పత్తి పెంచడానికి రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని రైతులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు