కల్వకుర్తిలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి...
* అసెంబ్లీలో ఎమ్మెల్యే కసిరెడ్డి డిమాండ్
ఆమనగల్లు, సెప్టెంబర్ 16(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం(Kalwakurthy Constituency)లో భూగర్భ జలాల లభ్యత తక్కువ ఉండడం తో రైతులు వాణిజ్య పంటల వైపు మళ్లుతున్నారని, అయితే స్థానికంగా మార్కెటింగ్ వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayan Reddy) శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో 3,134 ఎకరాల్లో పామాయిల్ సాగు జరుగుతోందని, దిగుబడిని విక్రయించేందుకు ఖమ్మం వరకు వెళ్లాల్సి రావడంతో కొత్తగా సాగు చేసేందుకు రైతులు సంకోచిస్తున్నారని తెలిపారు.అందుకోసం ఆమనగల్లు లేదా తలకొండపల్లి మండలాల్లో ప్రభుత్వం 25 నుంచి 30 ఎకరాల్లో పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే, ఎలాంటి ఆటంకం లేకుండా భూసేకరణ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయాన్నిచ్చే పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన పెంచాలని కోరారు. రూ. 213 విలువైన మొక్కను ప్రభుత్వం రూ. 20కే సబ్సిడీపై అందిస్తుండటంతో ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 300 మందికే స్పింక్లర్లు ఇచ్చామని, మరో 2,000 మంది రైతులు దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్నారని తెలిపారు. రైతుల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పింక్లర్లను మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.