స్వచ్ఛ మైన విశ్వనరుడు
తరతరాల అసమానతలను నిగ్గదీసిన కవుల్లో గుర్రం జాషువా(Gurram Jashuva) ముందు వరుసలో ఉంటారు. మనుషులను కుల వివక్ష విడగొట్టిన తీరు ను వేదనా భరితంగా తన రచనల ద్వారా కడిగిపారేశారు. చాతుర్వర్ణ వ్యవస్థ వికృత రూపాన్ని నిరసించారు. ఆయన పద్యరూపంలో రాసినా భావజాలపరంగా అత్యంత ఆధునికులు. తన కాలం (1895- 1971) సంప్రదాయ పండితుల సనాతన భావజాల ఉధృతిని తట్టుకుని ఏటికి ఎదురీదిన ధీరుడు గుర్రం జాషువా.
స్వీయానుభవ రచనలు
ఇంచుమించు 1920 నుంచి తెలుగు సాహిత్య ధోరణులను గమనిస్తే.. ఒకవైపు నవ్య సంప్రదాయ వాదం, మరోవైపు సామాజిక జీవనం కనిపిస్తుంది. వీటన్నింటినీ, వాటి పరిణామాలను జాషువా విశాలమైన జీవితా నుభవంతో అక్షరీకరించారు. ‘నవయుగ వైతాళికుడు’ అనే మాట ఆయన సాహిత్య నిబద్ధతను మరింత అవలోకన చేసుకోవడానికి ఓ ల్యాండ్ మార్క్. అప్పటికే దేశభక్తి , భావ కవిత్వం, జాతీయోద్యమం, అంతర్జాతీయంగా వస్తు న్న మార్పులు తెలుగు సాహిత్యంలో కొనసాగుతున్నాయి.
ఆ తరుణంలో జాషువా వాటిన్నంటినీ తన అనుభవిక ప్రపంచంలోకి తీసుకొస్తూనే సరికొత్తగా చాటిచెప్పారు. కుల వివక్ష చేసిన గాయాలను తనదైన శైలిలో ఖండ కావ్యాలుగా రచించారు. తనది కాని జీవితం గురించి రాయలేదు. అనుభూతికంటే స్వీయానుభవమే జాషువా రచనల సారంగా కనిపిస్తుంది. పద్యం నడిచిన తీరు భిన్నంగా ఉంటుంది. కులం పేరిట తనపై సమాజం చూపిన వివక్షను ‘గబ్బిలం’లో ప్రస్తావించి సమాజానికి ఎరుకచెప్పారు.
విశాలత ఉన్న కవి
సాహిత్యం అనేది సామాజిక అనుభవాల వ్యక్తీకరణ కనుక.. వ్యక్తిగత, సమాజగత అనుభవాలను ప్రతి రచనలోనూ గుర్రం జాషువా పంచుకున్నారు. ఆయన ఎంచుకున్న వస్తువు జీవితమంత విశాలమైనది. పద్య నిర్మాణ శైలి, అభివ్యక్తి ఆధునికమైనది. తన సమకాలీన కవులకు లేని జీవితానుభవం, ఎదుర్కొన్న కష్టాలు, ఆక లి, అవమానాలు, అవహేళనలు జా షువా అనుభవంలో ఉన్నాయి.
పంచముడు పడే వేదనతో ఆగిపోలేదు. మాతృప్రేమ, పసితనం, విద్య, పత్రికలు, భరతమాత, క్రీస్తు, బుద్ధుడు, నా గార్జునుడు, వివేకానందుడు, అంబేద్కర్, గాంధీ, బోస్, చీకటి, సూర్యోద యం, చంద్రోదయం, తుఫాను, కొత్త సంసారం.. ఇలా విభిన్నమైన అనుభవపూర్వక వస్తువులతో తాదాత్మ్యం చెందారు. వాటన్నింటినీ తన కవిత్వంలోకి తీసుకొచ్చి ప్రపంచానికి చాటిచె ప్పారు. విశాలత ఉన్న కవిగా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయారు.
చదువు విలువను చాటుతూ..!
ఏ సమాజమైనా అభివృద్ధి సాధించాలంటే చదువు ముఖ్యం. జాషువా ఇట్లా అంటారు...
‘చదువే నీ దేహ బలము
చదువే నీచక్కదనము
చదువే నీజాతికాయువురన్నా’..!
జీవితోన్నతికి, జాతి ఔన్నత్యానికి చదువే మార్గమని స్పష్టంగా వెల్లడించారు జాషువా. అభివృద్ధికి ఆలంబన జ్ఞానమేనని గుర్తించాలని హితోప దేశం చేశారు. తన జీవితంలో ఎన్ని పార్శాలున్నాయో అన్నింటిని కవితా వస్తువులుగా గుర్రం జాషువా స్వీకరించారు. భాష సాహిత్యాల గురించి రాశారు. నిండైన ప్రజాస్వామిక వాది ఆయన. మానవ విలువల్ని, సంబంధాలను సమాంతరంగా తన రచనల్లో నిలబెట్టారు. మానవ మనుగడకు అవసరమైన ప్రతి అంశాన్ని తన రచనల్లో నిక్షిప్తంచేశారు. జాషువా రచనల సారం.. భూగోళమంత విశాలమైనది. నిజమైన, స్వచ్ఛమైన విశ్వనరుడు జాషువా.
డా. ఎంవీ రమణ, 9989000265