జైనూర్ సీహెచ్‌సీలో సదరం క్యాంపు ఏర్పాటు చేయాలి
జైనూర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : జైనూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో(Health center) సదరం క్యాంపు ఏర్పాటు చేయాలని ఆదివాసీ మిత్ర వెల్ఫేర్ సొసైటీ(Adivasi Mitra Welfare Society) అధ్యక్షుడు వెంకటేష్ ఆడ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరమేరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల్లో అనేక మంది దివ్యాంగులు, మూగ, చెవిటి వారు, వయోవృద్ధులు ఉన్నారని తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో పాటు ఆన్లైన్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రమే సదరం క్యాంపు నిర్వహించడం వల్ల మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడం, ప్రయాణ ఖర్చులు భరించలేక చాలా మంది దివ్యాంగులు సదరం ధ్రువీకరణ పొందలేకపోతున్నారని వివరించారు.కాబట్టి జైనూర్ సీహెచ్‌సీలో సదరం క్యాంపు ఏర్పాటు చేసి కేరమేరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల దివ్యాంగులకు స్థానికంగానే సేవలు అందించాలని కలెక్టర్‌ను కోరారు.