బాపూజీ ఆశయాల సాధనే నిజమైన నివాళి
కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయం: జిందం కళ చక్రపాణి
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి అన్నారు. సోమవారం సిరిసిల్లలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆయన వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వాతంత్య్ర ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటంలో బాపూజీ కీలకంగా పోరాడారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. పద్మశాలి సంఘం బలోపేతానికి, కుల బాంధవుల ఐక్యతకు విశేష కృషి చేశారని అన్నారు.
ఈ నెల 27న బాపూజీ జయంతి వేడుకలను ప్రజలు, పద్మశాలి కులబాంధవులు పెద్దఎత్తున నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, కౌన్సిలర్లు, సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.