కేరళను ముంచెత్తిన వర్షాలు.. ఆరు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

21-09-2026 | 09:07am

తిరువనంతపురం: కేరళలోని ఆరు జిల్లాల్లో(Kerala districts) 'ఎల్లో అలర్ట్‌'(Yellow Alert) జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. సోమవారం అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. భారత వాతావరణ శాఖ (India Meteorological Department) ఉదయం 7 గంటలకు పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిస్సూర్ జిల్లాల్లో మూడు గంటలపాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

మలప్పురం జిల్లాలోని(Malappuram District) నిలంబూర్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి ఐదుకు చేరింది. కొట్టాపుజ నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు తిరిగి ప్రారంభించగా, మరో మూడు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నిలంబూర్‌లోని టీకే నగర్‌లో సంభవించిన ఆకస్మిక వరదలో ఆరుగురు కొట్టుకుపోయారు. ఘటనా స్థలంలోనే ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి. అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఆదివారం రాత్రి రెండు మృతదేహాలను వెలికితీశామని, సోమవారం ఉదయం గాలింపు చర్యలు తిరిగి ప్రారంభించిన తర్వాత మరో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.


మరిన్ని వార్తలు