ఘట్కేసర్లో తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి
ఘట్ కేసర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్(Prabuddha Bharata International) ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో 285వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్కేసర్ పట్టణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రజక సంఘం అధ్యక్షులు పొట్లచెరువు శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి పొట్లచెరువు శరత్, విచ్చేసి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం అన్నారు. ఘట్కేసర్ లో తెలంగాణ తల్లి వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలన్నారు. అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందని పేర్కొన్నారు.
ప్రతి వారం అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ చేస్తున్న ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చే విషయమని, ప్రజలను చైతన్యపరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి, ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాస్, ఉపాధ్యక్షులు కడపొల్ల బిక్షపతి, నాయకులు బండారి రాందాస్, కె. నర్సింగ్ రావు, కె. సత్యం, మీసాల రాజేష్ కుమార్, మంచాల విజయ్ కుమార్, సుదర్శన్, ఈ. విష్ణు, డి. శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.