హిందూ ఐక్యతకు ప్రతీక
రేపు వినాయక చవితి :
భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర(Indian Independence Movement)లో ప్రజలను ఏకం చేసి, వారిలో జాతీయ చైతన్యాన్ని(National consciousness) రగిలించిన మహనీయుల కృషి చిరస్మరణీయం. అందు లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్(Lokmanya Balgangadhar Tilak) పాత్ర విశిష్టం. బ్రిటిష్ పాలన(British Rule)లో ప్రజలు రాజకీయం(Politics)గా, సామాజికంగా విభజనకు(Social division) గురైన సమయంలో హిందూ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి గణేష్ ఉత్సవాలను ప్రజా ఉత్సవాలుగా తీర్చిదిద్ది, ఆధ్యాత్మికతను జాతీయ చైతన్యంతో మేళవించిన దార్శనికుడాయన.
నాడు గణపతి నవరాత్రి ఉత్సవాలు పూజలు, భక్తి కార్యక్రమాలకే పరిమితం కా కుండా ప్రజలందరినీ ఒకచోట చేర్చే సామాజిక వేదికలుగా మారాయి. కుల, వర్గ, ప్రాంత భేదాలను అధిగమించి భారతీయులు ఒకే భావంతో కలిసేలా చేశాయి. ఆ ఉత్సవాల ద్వా రా ప్రజల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసం, స్వాభిమానం, దేశభక్తి పెంపొందాయి. ప్రజా చైతన్యం స్వాతంత్య్రో ద్యమానికి బలమైన పునాదిగా నిలిచింది. స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దా లు గడిచినా.. నేటి పరిస్థితుల్లో మళ్లీ సమాజ చైతన్యం అవసరం ఏర్పడింది.
రాజకీయ విభేదాలు, కులాల మధ్య అంతరాలు, ప్రాంతీయ భేదాలు, పేద-ధనిక వ్యత్యాసాలు సమాజంలో దూరాలను పెంచుతున్నాయి. సామాజిక అసమానతలు, మత్తు పదార్థాల వ్యసనం, యువతలో చెడు అలవాట్లు, కుటుంబ వ్యవస్థపై పెరుగుతున్న ప్రభావాలు సమాజానికి ఆందోళన కలిగిస్తున్నాయి. మతమార్పిడులు, మహిళలు-బాలికల భద్రత వంటి అంశాలపై కూడా సమాజం మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో నాటి తిలక్ స్ఫూర్తితో నేటి వినాయక నవరాత్రి ఉత్సవాలు హిందూ సమాజ ఐక్యతకు, సామాజిక చైతన్యానికి, యువతలో ధార్మిక నిబద్ధతకు వేదికలుగా మారాలి. వినాయక మండపం అలంకరణల కోసం ఏర్పాటు చేసే ప్రదేశం కాకూడదు. అది విద్య, వినయం, విజ్ఞానం, నియమం, భక్తి, సేవ, సం స్కారం, ఐక్యతకు కేంద్రంగా నిలవాలి. గణపతిని విద్యా బుద్ధి ప్రదాతగా, విఘ్నేశ్వరుడిగా, శుభప్రదాతగా భక్తిశ్రద్ధలతో ఆరాధించే మన సంప్రదాయాలను నేటి తరానికి పరిచయం చేయాలి.
ప్రత్యేకంగా యువత ఈ ఉత్స వాలను వినోదానికి పరిమితం చేయకుండా ధర్మం, దేశం, సమాజం పట్ల బాధ్యతను స్వీకరించే సందర్భంగా మలచుకోవాలి. శారీరకంగా, మానసికంగా, నైతికంగా దృఢమైన యువతే బలమైన దేశానికి పునాది. అందుకే వినాయక ఉత్సవాల సందర్భంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల శిబిరాలు, విద్యార్థులకు ప్రోత్సాహక కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్సవాలకు మరింత సామాజిక ప్రయోజనం చేకూర్చాలి.
అదే సమయంలో వినాయక ఉత్సవాలు ఇతర మతాలపై ద్వేషాన్ని పెంచే వేదికలు కాకుండా, మన ధర్మం పట్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచే వేదికలు కావాలి. మన సంస్కృతిని మనమే తెలుసుకొని, ఆచరించి, తరువాతి తరాలకు అందించడమే నిజమైన ధర్మ పరిరక్షణ. గణపతి నిమజ్జనం కూడా క్రమశిక్షణ, భక్తి, వైభవం, సామూహిక సహకారానికి ప్రతీకగా ఉండాలి.
భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన ఉత్సవం అదే పవిత్రతతో, వైభవంతో, సామరస్యంతో ముగియాలి. నాడు గణపతి ఉత్సవం స్వాతంత్య్ర చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. నేడు అదే గణపతి ఉత్సవం హిందూ స మాజ ఐక్యతకు, యువత చైతన్యానికి ప్రతీకగా నిలవాలి. వి నాయక నవరాత్రులు భక్తి ఉత్సవాలుగానే కాదు.. హిందూ సమాజ చైతన్యానికి, ఐక్యతకు, సంస్కృతి పరిరక్షణకు మరో చారిత్రక సంకల్పంగా మారాలి.
పగుడాకుల బాలస్వామి
వ్యాసకర్త: ఉమాచార్య సంపర్క ప్రముక్,
వీహెచ్‌పీ, తెలంగాణ, 9912975753