నాగులపల్లిలో వాగు ఆక్రమణలపై చర్యలు
- మాజీ ఎమ్మెల్యే బక్కని సమాచార
- హక్కు దరఖాస్తుకు ఇరిగేషన్ శాఖ సమాధానం
షాద్‌నగర్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఫరూఖ్నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో వాగు ఆక్రమణలు, భూగర్భ పైపుల నిర్మాణం, ఇతర అక్రమ కార్యకలాపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే లేఖలు పంపినట్లు ఇరిగేషన్ శాఖ (Irrigation Department) వెల్లడించింది. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు సమాచార హక్కు చట్టం2005 కింద కోరిన సమాచారానికి ఇరిగేషన్ అధికారులు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
నాగులపల్లి గ్రామంలో వాగు ఆక్రమణతో పాటు భూగర్భ పైపుల నిర్మాణం, పైపులు వేయడం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని ఫరూఖ్నగర్ తహసీల్దార్, షాద్నగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఇప్పటికే లేఖలు పంపినట్లు ఇరిగేషన్ శాఖ తన సమాధానంలో పేర్కొంది. నాగులపల్లి గ్రామంలోని ఒక వెంచర్కు జారీ చేసిన ఎన్‌ఓసీ ప్రతితో పాటు, గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు కోరినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఎన్‌ఓసీ/వివరణకు సంబంధించిన కొన్ని ధ్రువీకృత పత్రాల్లో వ్యక్తిగత సమాచార అంశాలు ఉన్నందున, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1)(జె) నిబంధనల ప్రకారం ఆ సమాచారాన్ని వెల్లడించలేమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
అలాగే బాబుల్ చెరువు మిగులు కాలువ ప్రాంతంలో రోడ్డు వంతెన సమీపంలో భూగర్భ పైపులు వేయడం, ఓపెన్ రెక్టాంగ్యులర్ ఛానల్లో మట్టిని పోయడం వంటి చర్యలపై కూడా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు శాఖ అధికారులకు లేఖ పంపినట్లు ఇరిగేషన్ శాఖ వెల్లడించింది. నాగులపల్లి వాగు ఆక్రమణల వ్యవహారంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు లేఖలు వెళ్లిన నేపథ్యంలో.. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖలు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.






