నలుగురికి షోకాజ్ నోటీసులు
- దూషించుకున్న ఆదిలాబాద్ నేతలకు
- గజ్వేల్ ఇద్దరు నేతలకు నోటీసులు
- కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్న నోటీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో మరో నలుగురు నేతలకు షోకాజ్ నోటీసులు అందాయి. ఆదిలాబాద్ నియోజకవర్గ (Adilabad Constituency) కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ ఆదివారం షోకాజ్ నోటీసులు(Show Cause Notices) జారీ చేసింది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని నోటీసులు అందజేసింది. గత కొంతకాలంలో ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది.
ఉట్నూరులో ఇటీవల జరిగిన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశానికి ఆహ్వానం లేకపోయినా సంజీవరెడ్డి వచ్చారంటూ కంది శ్రీనివాస్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సమక్షంలోనే ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో వివరణ కోరుతూ ఇద్దరికీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు గజ్వేల్ నర్సారెడ్డి, మల్లారెడ్డికి సైతం నోటీసులు ఇచ్చింది. నర్సారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లారెడ్డి పీసీసీకి ఫిర్యాదు చేయడంతో ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. వారంలోపు నేతలు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో పార్టీ నేతల్లో గుబులు పుట్టగా తాజాగా మరికొందరు నేతలకు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.






