7 September, 2026 | 6:59 AM

మామూళ్ల మత్తు.. నిబంధనలు చిత్తు..

07-09-2026 | 05:05am
  1. నర్సాపూర్ పరిధిలో ‘బెల్టు’ జాతర!
  2. పర్మిట్ రూమ్‌లలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు
  3. అర్ధరాత్రి దాటినా రహస్య అమ్మకాలు
  4. గంజాయి సంస్కృతిపై ఆందోళన 
  5. మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ నిద్ర

నర్సాపూర్, సెప్టెంబర్ 6: నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అక్రమ మద్యం(Illegal Liquor) వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిబంధనలను తుంగలో తొక్కి పగలు, రాత్రి తేడా లేకుండా వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

నర్సాపూర్ మండల పరిధిలోని 35 గ్రామాల్లో కలిపి సుమారు 110కి పైగా, ఒక్క నర్సాపూర్ మండల కేంద్రంలోనే 20కి పైగా బెల్టు షాపులు నడుస్తున్నట్లు సమాచారం. హైవే నిబంధనలను పక్కనబెట్టి హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లనే అక్రమ అడ్డాలుగా మార్చేసి అర్ధరాత్రి 1 గంటల వరకు గంటల పాటు మద్యం విక్రయాలు జరుపుతున్నారు.

సంగారెడ్డి రూట్లోని ఓ వైన్ షాప్ విద్యాలయాలకు సమీపంలోనే ఉండటంతో పాటు, షాపు పక్కనే బహిరంగంగా తాగేందుకు షెడ్లు వేయడంతో విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రజలే స్వచ్ఛందంగా మద్యం నిషేధిస్తూ తీర్మానాలు చేసుకుంటున్నా, ఆబ్కారీ శాఖ అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బార్లను తలపిస్తున్న పర్మిట్ రూమ్‌లు

నర్సాపూర్, దౌల్తాబాద్లోని మద్యం దుకాణాలకు కేటాయించిన పర్మిట్ రూమ్లు బార్లను తలపిస్తున్నాయి. పర్మిట్ గదులలో ఆహార పదార్థాలు (స్నాక్స్), ముఖ్యంగా మాంసాహారం విక్రయించడం నిబంధనలకు విరుద్ధం. కానీ, మద్యం దుకాణదారులు బార్ల కంటే ఎక్కువ ధరలకు మాంసాహారాన్ని విక్రయిస్తూ వినియోగదారుల సొమ్మును కొల్లగొడుతున్నారు.

రాత్రి 11 దాటితే రహస్య విక్రయాలు.. ఎంఆర్‌పీకి గండి

రాత్రి 10 గంటలకు వైన్ షాపులు, బార్లు మూసివేయాల్సి ఉన్నప్పటికీ, బయటకు తలుపులు మూసి లోపల రహస్యంగా పక్కన స్నాక్స్ స్టఫ్ అమ్మే దాంట్లో మద్యం ఉంచి అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. సాధారణ రోజులతో పాటు సెలవు రోజుల్లో ఒక్కో బాట్పి రూ. 20 నుంచి రూ. 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

శాంతిభద్రతలకు విఘాతం.. గంజాయి విక్రయాలు

సమయపాలన లేని మద్యం అమ్మకాల వల్ల ప్రాంతంలో గొడవలు నిత్యకృత్య మవుతున్నాయి. ఇటీవల ఇబ్రహీంబాద్లోని ఓ బెల్టు షాపు వద్ద జరిగిన ఘర్షణ కత్తిపోట్ల వరకు దారితీయగా పోలీస్ కేసు నమోదైంది. మరోవైపు, మండలంలో కొన్నిచోట్ల గంజాయి విక్రయాలు కూడా విచ్చలవిడిగా జరుగుతున్నా, అధికారులు తమ పరిధి కానట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

‘మామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ?

మద్యం దుకాణాలు, బార్లు, బెల్టు షాపులు, గుడుంబా, కల్తీ కల్లు విక్రయదారుల నుంచి ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రతి నెలా ప్రభుత్వ జీతంలా ‘మామూళ్లు‘ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారులకు క్రమం తప్పకుండా ముడుపులు అందుతుండటం వల్లే ఈ అక్రమాలపై కనీస చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విద్యాసంస్థల సమీపంలో ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించాలని, బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుని అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఎక్సైజ్ సీఐ వివరణ

మద్యం దుకాణాల వద్ద అక్రమ షెడ్లు, నిబంధనల కు విరుద్ధంగా అర్థరాత్రి వరకు సాగే మద్యం మరియు మద్యం దుకాణాల వద్ద మాంసం, (స్నాక్స్) విక్రయాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తాం. అంతేకాకుండా గంజాయి, డ్రగ్స్ వంటి మారకద్రవ్యాల విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోం; వీటిపై సమాచారం ఉంటే వెంటనే చర్యలు తీసుకుంటాం. అలాగే, అర్ధరాత్రి వేళల్లో బెల్టు షాపులు, ఇళ్ల వద్ద, గ్రామాల్లో, వైన్ షాపుల పక్కన ఉండే స్నాక్స్ సెంటర్లలో, జరిగే మద్యం విక్రయాలను అరికట్టేందుకు నైట్ పెట్రోలింగ్ నిర్వహించి చట్టపరమైన కేసులు నమోదు చేస్తాం.‘

మరిన్ని వార్తలు