7 September, 2026 | 6:54 AM

22ఏ, ఫీజు బకాయిలే బీజేపీ అస్త్రాలు

07-09-2026 | 05:35am

అసెంబ్లీలో సమరానికి కమలనాథులు సన్నద్ధం

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే వ్యూహం

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): నేటి నుంచి ఆరంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై సమరానికి బీజేపీ(BJP) సన్నద్ధమైంది. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసే వ్యూహాలతో బీజేపీ శాసనసభా పక్షం యుద్ధానికి సిద్ధమైంది. ముఖ్యంగా 22ఏ నిషేధిత భూముల జాబితా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ప్రధాన అస్త్రాలుగా విద్యార్థులు, పేదల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఆదివారం బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(BJP Leader Alleti Maheshwar Reddy) అధ్యక్షతన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు  సభలో అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఫీజు బకాయిలు, 22ఏ భూముల జాబితా తదితర అంశాల్లో పక్కా సబ్జెక్టుతో సభలోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ప్రశ్నోత్తరాల సమయం, స్వల్పకాలిక చర్చలు, అత్యవసర చర్చల సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని, ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

అంశాల వారీగా ఎల్పీనేత, డిప్యూటీ- ఎల్పీ నేతలతో పాటు- ఇతర ఎమ్మెల్యేలకు బాధ్యతలను అప్పగించినట్టు- తెలుస్తోంది. రుణమాఫీ, రైతు భరోసా, ప్రజా హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు చేపడుతున్న దీక్షలు, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలను వాయిదా తీర్మానంతో లేవనెత్తాలని భావిస్తోంది. దీంతో రోడ్లపై విని పిస్తున్న ప్రజా స్వరానికి సభ లోపల కూడా బలం చేకూరి, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ కంటే ముందే ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని నిర్ణయించింది.

శాంతిభద్రతలు, రైతాంగ సమస్యలు, అవినీతి ఆరోపణలను సభలో ప్రధానంగా ప్రస్తావించాలని  నిర్ణయించింది. ఇతర ప్రతిపక్షాలతో పోలిస్తే అసెంబ్లీలో ప్రభావవంతమైన పాత్ర పోషించాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. కాగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, ఫీజు రీయింబర్స్ మెంట్, అవినీతి అక్రమాలపై ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామని హెచ్చరించారు. సభను నడపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు