ముందు తెలంగాణలోనే ఓపీఎస్ రావాలె
సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయడానికంటే ముందే తెలంగాణలో ప్రజాప్రభుత్వం (People's Government in Telangana) ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ కోరారు. ఎన్నికల నాటి హామీ మేరకు రాష్ట్రంలోని 2.68 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాల భవిష్యత్తును కాపాడేలా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయం తీసుకోవాలని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక త్వరలో ఓపీఎస్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వరంగల్, జడ్చర్ల, కామారెడ్డి సభల్లో, అలాగే భట్టి విక్రమార్క అచ్చంపేట పాదయాత్ర సందర్భంగా సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మాటలు నమ్మి కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ఉద్యోగుల నమ్మకాన్ని కాపాడే బాధ్యత సీఎంపైనే ఉందన్నారు.
ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీయొద్దు
తెలంగాణ రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి కీలక సమావేశం అసోసియేషన్ అధ్యక్షులు స్థితప్రజ్ఞ అధ్యక్షతన హైదరాబాద్‌లోని కేశవ్ మెమోరియల్ ఆడిటోరియంలో జరిగింది. శాఖాపరమైన సమస్యలు, పోలీసుల అరెస్టులపై చర్చించి పలు తీర్మానాలు చేశారు.
అరెస్టులతో ఉద్యోగుల మానసిక స్థుర్యైన్ని దెబ్బతీయొద్దని, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అరెస్టులు ఆపాలని కోరారు. 20 సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నా, అందుకు తగినట్లుగా సిబ్బంది సంఖ్యను పెంచలేదని, వెంటనే పనిభారానికి అనుగుణంగా శాఖను పునర్వ్యవస్థీకరించాలనీ డిమాండ్ చేశారు.






