జడలతో యాక్షన్ సీన్స్.. మాకూ కొత్తగా అనిపించింది!
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
* ‘ప్యారడైజ్’కు ఫైట్ మాస్టర్స్‌గా మేము, నవకాంత్, రియల్ సతీశ్ పనిచేశారు. ఇందులో మేం రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ కంపోజ్ చేశాం. మా అబ్బాయి కూడా ఇందులో పనిచేశాడు. నాని క్యారెక్టర్‌ను దర్శకుడు శ్రీకాంత్ (Director Srikanth) చాలా కొత్తగా డిజైన్ చేశారు. రెండు జడలు వేసుకున్న హీరోను ఇండియన్ స్క్రీన్ (Indian Screen) పై ఇప్పటివరకు చూడలేదు. నాని ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.. ఆయన ఈ స్థాయిలో యాక్షన్ చేయడం ఇదే తొలిసారి.
ఇందులో యాక్షన్ సీన్స్ చాలా భారీగా, ‘దసరా’ కంటే మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం మామూలు విషయం కాదు. యాక్షన్ చేస్తున్నప్పుడు ఆ జడలు రూప్స్‌కి, ముఖానికి తగులుతుంటాయి. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ చేయడం మాకు కూడా కొత్త అనుభవమే.
మా అసిస్టెంట్‌కు కూడా జడలు వేయించి అందులో ఉండే కష్టం తెలుసుకుని మరీ యాక్షన్‌ను కంపోజ్ చేశాం. -నాని కెరీర్‌లోనే ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు. ప్రతి విషయంలో 100 శాతం కష్టపడ్డారాయన. ఎన్ని టేక్స్ అయినా చేయాలని మనసులో ఫిక్స్ అయ్యాడు. నిజంగా నాని ఇంత కష్టపడతాడని మేం ఊహించుకోలేదు.
* ఈ సినిమాలో -నాని బేర్ బాడీ (షర్టు లేకుండా)తో చేసే యాక్షన్ సీక్వెన్సులుంటాయి. అవి స్క్రీన్‌పై చేయడం అంత ఈజీ కాదు. బాడీ బిల్డింగ్ చేయాలి. డైటింగ్‌లో ఉండాలి. అందులోనూ దర్శకుడు శ్రీకాంత్ తనకు అనుకున్నది వచ్చేంతవరకు రాజీపడరు. శ్రీకాంత్ తీసుకున్న విజన్‌కు నాని 100 శాతం న్యాయం చేశారు. మా యాక్షన్ బ్లాక్స్ పూర్తి చేయడానికి దాదాపు 10 రోజులు పట్టింది. ఇందులో కొత్త మనుషులు, కొత్త బాడీ లాంగ్వేజ్.. అంతా కొత్తగానే ఉంటుంది.
దర్శకుడు శ్రీకాంత్ ఎంచుకున్న కథ సహజంగానే యాక్షన్‌నున డిమాండ్ చేస్తుంది. ఇందులో తప్పించుకోవడానికి అవకాశం ఉండదు.. ఫైట్ చేయాల్సిందే. యాక్షన్‌ను కంపోజ్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాం.
ఎందుకంటే ఇలాంటి బాడీ లాంగ్వేజ్‌తో సినిమా ఇంతకుముందు రాలేదు. ఇందులో చాలా రిస్కీ యాక్షన్ ఉంటుంది. షూటింగ్ సమయంలో మా యూనిట్‌లో ఒకరికి గాయం కూడా అయింది. మోహన్‌బాబు ఇప్పటివరకు చాలా సినిమాలు చేశారు. కానీ ‘ప్యారడైజ్’లో చాలా కొత్తగా కనిపిస్తారు. ఆయనకూ యాక్షన్ సీక్వెన్సులున్నాయి.
* ఇండస్ట్రీకి కొత్త ఫైట్ మాస్టర్స్ వస్తున్నప్పుడు మేం కచ్చితంగా కాంపిటీషన్‌గా ఫీల్ అవుతాం. అయినా పోటీ ఉన్నప్పుడే క్రియేటివిటీ పెరు గుతుంది. ఇంకా ఎలా కొత్తగా చేయాలనే తపన వస్తుంది. మేం ప్రతిరోజూ తొలి సినిమా చేస్తున్న ఫైట్ మాస్టర్స్‌లా భయంతో పనిచేస్తుంటాం. నిర్మాత సుధాకర్ ఎక్కడా రాజీపడకుండా భారీగా ఖర్చు పెట్టి బిగ్ స్కేల్‌లో నిర్మించారు. ఈ సినిమాకు అద్భుత విజయం తప్పకుండా దక్కుతుందని మేం నమ్ముతున్నాం.
మేమూ కొట్టుకుంటాం!
పనిలో భాగంగా చాలా సార్లు వాదులాడుకున్నామని ఫైట్స్ మాస్టర్స్ ఈ సందర్భంగా తెలిపారు. ఓ యాక్షన్ సీన్ కంపోజ్ చేసినప్పటి ఓ సందర్భాన్ని ఫైట్ లక్ష్మణ్ వివరిస్తూ.. ‘ఫైట్స్ కంపోజ్ చేసేటప్పుడు చాలా సార్లు మేం కూడా ఫైట్ చేసుకుంటాం. (నవ్వుతూ). కొట్టుకోవడమంటే, ఒకరినొకరు చేతులతో కొట్టుకోవడం కాదు.. మాటల యుద్ధమన్నమాట! ఇలాగే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో బళ్లెంతో పైకెత్తే సన్నివేశం కంపోజ్ చేశాం.
అది నాకు (లక్ష్మణ్) బాగా నచ్చింది. వీడికి (రామ్) నచ్చలేదు. ఈ సంభాషణను ఫైట్ మాస్టర్ రామ్ కొనసాగిస్తూ.. ‘అయితే అది బాగాలేదు.. నాకు నచ్చలేదు. ఇది వద్దు అని నేనూ (రామ్), ఇదే ఫైనల్ చేద్దామని వాడు (లక్ష్మణ్).. ఎవరికి వాళ్లం పట్టుబట్టాం. ఇక నేను డైరెక్టర్‌తో చెప్పి క్యాన్సిల్ చేయిద్దామని చూస్తుంటే, వీడేమో (లక్ష్మణ్) అదే బాగుందని డైరెక్టర్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు’ అంటూ సెట్స్ జరిగే ఈ సరదా సన్నివేశాన్ని విలేకరులతో పంచుకున్నారు.