24 May, 2026 | 1:26 AM

యశోదలో అంబులెన్స్ కమాండ్ సెంటర్

24-05-2026 12:30 AM

యశోద హాస్పిటల్స్ -హైటెక్‌సిటీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సెంట్రల్ అంబులెన్స్ కమాండ్ సెంటర్, స్పెషల్ కనెక్టెడ్ అంబులెన్స్ సర్వీసెస్‌ను శనివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్, యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ ఎ లింగయ్య, యశోద హాస్పిటల్స్-హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ వెంకట్ రమణ్ కోలా ప్రారంభించారు.

ఈ వినూత్న అత్యాధునిక వ్యవస్థ హైదరాబాద్ నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ ట్రామా కారిడార్లలో, అత్యవసర పరిస్థితుల సమయంలో కీలకమైన గోల్డెన్ అవర్‌లో సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించేందుకు రూపొందించబడింది. ఈ అత్యాధునిక ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థలో ప్రపంచస్తాయి అంబులెన్స్ టెక్నాలజీ, కేంద్రీకృత కమాండ్ ఆపరేషన్స్, రియల్-టైమ్ టెలీ మానిటరింగ్, స్పెషలిస్ట్ గైడెడ్ ఇంటర్వెన్షన్స్, ట్రామా రెస్పాన్స్ వ్యవస్థలను ఒకే వేదికపై అత్యవసర వైద్య సేవలను వేగవంతంగా అందించడానికి సమన్వయం చేశారు.

సైబరాబాద్ సీపీ రమేష్ మాట్లాడుతూ.. యశోద హాస్పిటల్స్ ప్రారంభించిన ఈ సెంట్రల్ అంబులెన్స్ కమాండ్ సెంటర్ రోడ్డు ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య స్పందన అందించి ప్రాణాలను కాపాడటంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కనెక్టెడ్ అంబులెన్స్ టెక్నాలజీ, రియల్టైమ్ మానిటరింగ్, ఓఆర్‌ఆర్ ట్రామా కారిడార్ సమన్వయం ద్వారా గోల్డెన్ అవర్లో అత్యవసర వైద్య స్పందన మరింత సమర్థవంతంగా మారనున్నదని పేర్కొన్నారు.

యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ లింగయ్య మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సెకను ఎంతో విలువైనది. ఆ ప్రతి సెకనునూ సమర్థవంతంగా వినియోగించి రోగులకు వేగవంతమైన, ఖచ్చితమైన, ప్రాణరక్షక వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం అని తెలిపారు. 24/7 అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 105910తో అనుసంధానమైన ఈ కమాండ్ సెంటర్ను అత్యంత వేగవంతమైన వైద్య స్పందన వ్యవస్థగా రూపొందించామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కేవలం కొన్ని సెకన్లలోనే స్పందించి, ఆసుపత్రి స్థాయి అత్యవసర వైద్య సేవలను రోగి వద్దకే, అంబులెన్స్ ప్రయాణ సమయంలోనే అందించే విధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశామని తెలిపారు.

అలాగే, ఈ కనెక్టెడ్ అంబులెన్సుల్లో అత్యాధునిక రియల్టైమ్ టెలీ-మానిటరింగ్, టెలీ-మెడిసిన్ సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యాథ్ ల్యాబ్స్, ఆపరేషన్ థియేటర్స్, స్ట్రోక్ టీమ్స్, ట్రామా టీమ్స్, ఐసీయూ బెడ్స్, అడ్వానస్డ్ ఇమేజింగ్ వంటి కీలక వైద్య సదుపాయాలను రోగి ఆసుపత్రికి చేరుకునే ముందుగానే సిద్ధం చేసే అవకాశం ఈ అత్యాధునిక  వైద్య వ్యవస్థ ద్వారా కలుగుతుందని వివరించారు.