24 August, 2026 | 2:14 AM

కమాన్‌పూర్‌లో ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

24-08-2026 12:47 AM

నేటి నుంచి 26 వరకు వేడుకలు.. 

హాజరుకానున్న మంత్రి శ్రీధర్‌బాబు

కమాన్పూర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నుంచి ఈ నెల 26వ తేదీ బుధవారం వరకు జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కొసన కాంతారెడ్డి తెలిపారు. జయంతి ఉత్సవాలకు వ చ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయానికి వెళ్లే రహదారికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.

ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హవనం, కళ్యాణ మహోత్సవం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు శ్రీ విష్ణుసహస్రనామ పారాయణం, 7 గంటలకు అంకురార్పణ, రక్షాబంధనం, మృత్యంగ్రహణం కార్య క్రమాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.ఈ నెల 24న ఉదయం నిత్యాభిషేకం, గోపూజ, ఆదివరాహ హవనం, సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం, నిత్య పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

25న నిత్యాభిషేకం, గోపూజతో పాటు ఉదయం 10 గంటలకు శ్రీ ఆదివరాహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం పూర్ణాహుతి, సాయంత్రం విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు.26న జయం తి ప్రధాన వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవం, 11.30 గంటలకు సత్యపూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ ఆదివరాహ స్వామివారికి భక్తులు సమర్పించిన రజత కవచధారణ, అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

మూడు రోజుల పాటు అన్నదానం

జయంతి ఉత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కమాన్పూర్ మండలానికి చెందిన, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో స్థిరపడిన వ్యాపారవేత్తలు మాదాసు సుజాతరవీందర్ అన్నదానానికి దాతలుగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

హాజరుకానున్న మంత్రి శ్రీధర్‌బాబు

శ్రీ ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు ఇతర మంత్రులు, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు కోరారు.