ఘనంగా ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

23-09-2026 | 07:49pm

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 23: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని(Ayurveda Day) పురస్కరించుకొని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య(District Additional Collector Chandraiah) హాజరై శిబిరంలో అందిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలు, వివిధ ఆయుర్వేద ఔషధాలను పరిశీలించి, వాటి వినియోగం, ప్రయోజనాల గురించి ఆయుర్వేద వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆరోగ్య పరిరక్షణలో ఆయుర్వేదం ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని, ఆయుర్వేద వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని 12 ఆయుర్వేద ఆసుపత్రుల ద్వారా ప్రజలకు ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. 

జీవనశైలి మార్పుల కారణంగా వచ్చే రక్తపోటు, మధుమేహం తదితర అసంక్రమణ వ్యాధుల నియంత్రణలో ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన జీవన విధానం, వ్యాయామం, యోగా, ధ్యానం వంటి అలవాట్ల ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న సదరం శిబిరాన్ని సందర్శించి నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు, అందిస్తున్న సేవల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

క్యాంపునకు సంబంధించిన రికార్డులు, పత్రాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సదరం శిబిరానికి వచ్చిన సికిల్ సెల్, ఎనీమియా బాధితులు, వారి తల్లిదండ్రులకు కూడా ఆయుర్వేద వైద్యం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్, జిల్లా ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ నీరజ, జిల్లా ప్రోగ్రాం అధికారి రవీందర్ రాథోడ్, ఆయుష్ వైద్యులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు