భారత్‌కు బ్రిక్స్ సవాల్
ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు(Political equations), పశ్చిమాసియా(West Asia)లో సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధం(War), అమెరికా విధానాల(America policies)పై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో ఢిల్లీ వేదిక(Delhi Venue)గా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు(BRICS Summit) ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Chinese President Jinping) ఏడేళ్ల తర్వాత భారత్(India)కు వస్తుండటం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)తో ప్రధాని మోదీ(Prime Minister Modi) సమావేశం కానుండటం ఈ సదస్సు ప్రాముఖ్యాన్ని మరింత పెంచుతున్నది.
ఈ నేపథ్యంలో బ్రిక్స్ భవిష్యత్తు దశదిశలతోపాటు భారత్ అనుసరించబోయే వైఖరి కూడా ఈ సందర్భంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా బ్రిక్స్ వేదికను పంచుకుంటుండటంతో పశ్చిమాసియా పోరుపై ఏకాభిప్రాయానికి రావడం అంత సులభం కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా- ఇరాన్ మధ్య సాగుతున్న ఘర్షణపై ఉమ్మడి ప్రకటన భారత దౌత్య నైపుణ్యానికి పరీక్షగా నిలవనున్నది. వాస్తవానికి పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి బ్రిక్స్ ప్రత్యామ్నాయమని రష్యా, చైనా భావిస్తున్నాయి.
కానీ, భారత్ మాత్రం మొదటినుంచి అమెరికాతోపాటు ఐరోపా దేశాల వ్యతిరేక కూటమిగా బ్రిక్స్‌ను మార్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పశ్చిమాసియా పోరు, హోర్ముజ్ మూసివేత వంటి కారణాల వల్ల ఇప్పటికే అగ్రరాజ్యం వైఖరి పట్ల ఐరోపా సహా ప్రపంచ దేశాల్లో క్రమంగా వ్యతిరేకత పెరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఆధిపత్యానికి గండికొట్టే చర్చలకు బ్రిక్స్ మరోసారి వేదికగా మారే ఆస్కారం ఉన్న నేపథ్యంలో భారత్ ఎలాంటి ధోరణిని ప్రదర్శిస్తుందో చూడాలి.
మరోవైపు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఆ దేశాధినేత జిన్‌పింగ్ భారత పర్యటనకు వస్తుండటాన్ని ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఈ సందర్భంగా చైనాతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు ఆర్థిక, వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంపై భారత్ దృష్టిసారించాలి. ముఖ్యంగా చైనాలో విరివిగా లభించే రేర్ ఎర్త్ మెటీరియల్స్ దిగుమతుల విషయంలో సులభతర వాణిజ్య ఒప్పందాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
అదే సమయంలో సరిహద్దు రక్షణ, జాతీయ భద్రత వంటి అంశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. సుదీర్ఘ కాలంగా సత్సంబంధాలు కొనసాగిస్తున్న రష్యాతోనూ సమన్వయం చేసుకోవాలి. అంతిమంగా చెప్పాలంటే ఎవరినీ నొప్పించకుండా ప్రపంచ వాణిజ్యానికి మార్గం సుగమం చేయడమే ప్రస్తుతం భారత దౌత్యానికి అతిపెద్ద సవాల్.