ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ భారీ ఆటో ర్యాలీ
మల్లాపూర్ నుంచి నాచారం వరకు నిరసన ప్రదర్శన
పాల్గొన్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) 1000 రోజుల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తా నుంచి నాచారం వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజా సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించారు.
తాగునీటి కొరత, వీధి దీపాల లేమి, ట్రాఫిక్ సమస్యలు, శాంతిభద్రతల పరిరక్షణ, బస్తీ దవాఖానల ఏర్పాటు వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా ఉంచుకుని ఈ ర్యాలీ చేపట్టారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) హాజరై ర్యాలీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస మౌలిక వసతులు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, వైద్య సేవలు వంటి ప్రాథమిక అవసరాల కల్పనలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక, వృత్తిపరమైన సమస్యలను ప్రభుత్వం గుర్తించి, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఉప్పల్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ర్యాలీ అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం, ఆటో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






