అడవి పంది మాంసం కేసులో ముగ్గురిపై కేసు
09-09-2026 | 11:08pm
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి రేంజ్ ధర్మారావుపేట సెక్షన్, ధర్మారావుపేట బీట్ పరిధిలో బుగ్గగూడ గ్రామ సమీపంలోని పత్తిచేనులో అడవిపంది మాంసంతో సంకుర్తల శ్రీకాంత్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. బెల్లంపల్లి రేంజ్ ఆఫీసర్ సీహెచ్ పూర్ణచందర్ సంఘటన వివరాలను వెల్లడించారు. అటవీశాఖ అధికారులకు అందిన ముందస్తు సమాచారం మేరకు సంఘటనా స్థలంలో గాలింపు చేపట్టగా శ్రీకాంత్ వద్ద అడవిపంది మాంసం లభించింది. విచారణలో అడవిపందిని వేటాడి చంపినట్లు శ్రీకాంత్ అంగీకరించడంతో పాటు, మాంసం కొనుగోలు చేసేందుకు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు శ్రీనివాస్,రంజిత్ ఉన్నట్లు వెల్లడించాడు. ముగ్గురు వ్యక్తులు నేరాన్ని అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముగ్గురిపై సంబంధిత అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి రేంజ్ ఆఫీసర్ CH. పూర్ణచందర్ తెలిపారు.