రూ.1.50 కోట్లతో అన్ని పంచాయతీల్లో సీసీ కెమెరాలు: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో (Gram Panchayat)సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha)అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్ షాలోమ్ లతో కలిసి సీసీ కెమెరాల ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 1.50 కోట్లు మంజూరయ్యాయని, రాష్ట్రంలోనే తొలిసారిగా జనగామ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద రెండు కెమెరాల చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు.
మొదటి దశలో మండలాల వారీగా: బచ్చన్నపేట-56, నర్మెట్ట-38, తరిగొప్పుల-34, జనగామ రూరల్-167, లింగాల ఘనపురం-54, రఘునాథపల్లి-84, చిల్పూర్-42, ఘనపూర్ స్టేషన్-38, జఫర్ గడ్-46, పాలకుర్తి-80, కొడకండ్ల-46, దేవరుప్పుల-68 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, జీవో నెం. 52 ప్రకారం ఈ-టెండర్ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీపీఓ వెంకట్ రెడ్డి, ఏసీపీలు భీమ్ శర్మ, నర్సయ్య, పోలీసు అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్లు వెంకటేశ్వర్లు, ఫణి కిశోర్, ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు.