నత్తనడకన సెంట్రల్ లైటింగ్ పనులు

28-09-2026 | 05:25am
  1. నిబంధనలకు తిలోదకాలు
  2. దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా పూర్తికాని డ్రైనేజీ పనులు
  3. ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న గుత్తేదారు

బిచ్కుంద సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రంలో ప్రారంభమైనటువంటి సెంటర్ లైటింగ్ పనులు(Center lighting works) సక్రమంగా కొనసాగడం లేదని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో అంతా గోల్ మాల్ నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నారని గ్రామస్తులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. పనులు ప్రారంభమై దాదాపు రెండు సంవత్సారాల సమయం కావస్తున్నా ఇంతవరకు కనీసం డ్రైనేజీ పనులు, డివైడర్ పనులు, లైటింగ్ పనులు పూర్తి కాకపోవడం గమనార్హం.

రోడ్డు వెడల్పు ఇరువైపుల సెంటర్ నుండి 48 ఫీట్లు తీసుకోవాల్సి ఉండగా కొందరు నాయకులు తమ హుకుం చలాయించుకుంటూ వాళ్లకు అనుకూలంగా ఉన్న చోట్లలా 45 ఫీట్లు, మరి కొన్ని చోట్ల 46 ఫీట్ల వరకు కుదించుకొని రోడ్డు పనులను కొనసాగిస్తున్నారు. సదరు గుత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని స్థానికులు, వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాబేలు నడక మాదిరిగా అతి మెల్లగా పనులు జరుగుతుండడం వలన ప్రజలు నిత్యము, దుమ్ము, ధూళితో పాటు రోడ్డుపై సరిగ్గా ప్రయాణం చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

నాసీరకం మెటీరియల్ వినియోగిస్తున్నట్లు వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా రోడ్డుకు ఇరువైపులా కడుతున్న డ్రైనేజీ కు కనీసం క్యూరింగ్ కూడా చేస్తలేరని, దీంతో కొన్ని నెలల్లోనే పాడవుతుందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్డును యధావిధిగా ఇరువైపులా 48 ఫీట్లకు గాను మంజూరు చేయబడిందో అలాగే కొనసాగించి అతి తొందరగా పనులు ముగించాలని వ్యాపారులు, గ్రామస్తులు కోరుతున్నారు.


మరిన్ని వార్తలు