చికిత గోల్డెన్ డబుల్

01-10-2026 | 05:10am

ఆసియా క్రీడల్లో మెరిసిన తెలంగాణ అమ్మాయి

ఒకేరోజు రెండు స్వర్ణాలతో రికార్డు

గ్రామీణ స్థాయి నుంచి ఒలంపిక్స్‌కు అర్హత

ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు

సుల్తానాబాద్/ఎలిగేడు, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): పేదరికం.. అరకొర వసతులు.. సాధించాల్సిన లక్ష్యానికి ఏ మాత్రం అడ్డుకాదనీ తెలంగాణ అమ్మాయి, ఆర్చరీ క్రీడాకారిణి చికిత తానిపర్తి(Archer Chikita Taniparthi) నిరూపించింది. తన కలకు తండ్రి ప్రోత్సాహం తోడయితే దానిని ఎలా సాకారం చేసుకోవచ్చో చూపించింది.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెం దిన ఆమె, ఒక సాధారణ వ్యవసాయ కు టుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠను చాటింది. ఆమె తండ్రి శ్రీనివాసరావు ఒక సాధారణ రైతు. చికిత మొదట కరాటే (బ్లాక్ బెల్ట్) నేర్చుకుంది. కానీ క్రీడల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఆమె తండ్రి ప్రోత్సాహంతో 2018లో ఆర్చరీ వైపు మళ్లింది. తండ్రి శ్రీనివాసరావు రోజూ తన గ్రామం నుంచి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లి ఆమెకు శిక్షణ ఇప్పించేవారు.

2022లో సోనేపట్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రంలో చేరడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. అక్కడిని పుణులైన శిక్షకుల మార్గదర్శకత్వంలో ఆమె ప్రతిభకు మరింత పదును పెరిగింది. కెనడాలోని విన్నిపెగ్‌లో జరిగిన అండర్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించి, ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా రికార్డు సృష్టించింది. ఇపుడు ఆసియా క్రీడ(Asian Games)ల్లో చికితారావు ఒకే రోజు రెండు స్వర్ణాలు అందుకుంది. జ్యోతి సురేఖ వెన్నం, పృథికా ప్రదీప్‌లతో కలిసి చైనాపై విజయం సాధించి స్వర్ణం గెలిచింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సాహిల్ జాదవ్‌తో కలిసి సౌత్ కొరియాపై ఉత్కంఠభరిత విజయం సాధించి మరో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లను అధిగమించి నేడు దేశంలోనే అగ్రశ్రేణి ఆర్చర్‌గా ఎదిగి ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులకు చికిత స్ఫూర్తిగా నిలిచింది.

మరిన్ని వార్తలు