సమయానికి రాకపోతే.. గేటు బయటే!
ఉద్యోగుల సమయపాలనపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి..
ఉ.10:40 గంటల తర్వాత కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళం
ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఉద్యోగుల సమయపాలనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. కొంతమంది ఉద్యోగుల పనితీరులో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించడం లేదన్న అభిప్రాయాల నేపథ్యంలో అధికారులు సమయపాలనపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10:40 గంటలు దాటిన తర్వాత కలెక్టరేట్ ప్రధాన గేటుకు తాళం వేసినట్లు(Collectorate main gate locked) సమాచారం. నిర్ణీత సమయానికి కార్యాలయానికి హాజరుకాని ఉద్యోగులను లోపలికి అనుమతించకుండా తీసుకున్న ఈ చర్య కలెక్టరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగులు విధులకు నిర్ణీత సమయానికి హాజరై ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ఉద్యోగుల హాజరు, సమయపాలనపై మరింత కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉంటుందనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.