ధ్రువపత్రాల పరిశీలన త్వరగా పూర్తి చేయాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
జైపూర్: మంచిర్యాల జిల్లా(Mancherial District) జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR process of voter list)లో మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలో ఓటర్లకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాల ప్రక్రియను బుధవారం పరిశీలించారు. జైపూర్ మండలం నర్వ గ్రామంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో నోటీసుల జారీ, విచారణ ప్రక్రియలను వేగవంతం చేసి నిర్ణీత గడువుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. టేకుమట్ల గ్రామంలో తహసిల్దార్ వనజ రెడ్డి, ఎంపీడీఓ శ్రీపతి బాబులతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కుందారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)ను సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజన నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. అనంతరం వేలాలలోని ఇసుక రీచ్ ను సందర్శించారు. ఎస్.ఎస్.ఎం.ఎం.ఎస్. వెబ్ సైట్ ద్వారా చేపడుతున్న ఇసుక సరఫరా ప్రక్రియను పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు. ఇసుకను పారదర్శకంగా, అధికారికంగా అందించడం జరుగుతుందని, ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారులకు బుకింగ్ ప్రకారం నిర్ణీత గడువులోగా సరఫరా చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షించాలని, ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.