వినాయక మండపాలు, నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

08-09-2026 | 10:01pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): వినాయక చవితి(Ganesh Chaturthi) సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసే వినాయక మండపాలు, నిమజ్జన కార్యక్రమాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు, ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హరిత(Collector K. Haritha) అధికారులను ఆదేశించారు.మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మార్మట్, ఎం. డేవిడ్ తదితర అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జన ప్రాంతాలను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, అగ్నిమాపక, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని నిమజ్జన ప్రదేశాల్లో అవసరమైన క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.మండపాలు, నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్ భద్రతా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖను, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను, తాగునీటి వసతి కల్పించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.

అగ్నిమాపక, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖలు తమ పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వదంతులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించి నిబంధనలు పాటించాలని కోరారు.

మరిన్ని వార్తలు