ప్రతి గడపకు కాంగ్రెస్ సంక్షేమ పథకాలు

08-09-2026 | 11:43pm

ఘనంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు

అలరించిన జబర్దస్త్ టీం

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) అన్నారు. మంగళవారం ఇల్లందులో తన జన్మదినం(birthday ) సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉదయం జేకే కాలనీలోని హరిహర క్షేత్రంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

అయిత కాంప్లెక్స్ వేదికగా ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా అన్నదానం, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ పంపిణీ, పేద మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. జబర్దస్త్ ఫేమ్ వినోద్, నవీన్, రాజు టీం ప్రదర్శించిన హాస్య స్కిట్లు, స్థానిక యాసలో పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించాయి.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెయ్యి రోజుల్లో పేదలకు రెండు లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేశామని తెలిపారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీతో పాటు రైతు బీమా, రైతు భరోసా అమలు చేస్తున్నామని చెప్పారు. గత బీఆర్‌ఎస్ పాలనలో రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని విమర్శించారు.

అసెంబ్లీ గేట్ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కనకయ్య తెలిపారు. స్పీకర్ పదవి ఏ పార్టీకి చెందినది కాదని, శాసనసభ గౌరవానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అన్నారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి తప్ప అసెంబ్లీ ముందు నిరసనల పేరుతో అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి కార్యకర్త గడపగడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు