వేరుశనగలో విత్తన శుద్ధి పాటించాలి
ములకలపల్లి,(విజయక్రాంతి): వేరుశనగ పంటలో రైతులు విత్తనశుద్ధి పాటించి అధిక దిగుబడులు సాధించాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం(Kothagudem Krishi Vigyan Center) శాస్త్రవేత్త భరత్ సూచించారు. మంగళవారం ములకలపల్లి గ్రామములోని బింగి చిలకమ్మ వేరుశనగ పంటలో పొలంబడి కార్యక్రమం(Farming program) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... నేల తయారీ,విత్తన ఎంపిక,కలుపు నియంత్రణ గురించి తెలియజేసారు. వేరుశనగ విత్తనాలను రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోని విత్తుకోవాలని తెలియజేశారు. వేరుశనగ పూత దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 కిలోల జిప్సం వేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు అశ్వారావుపేట రవి కుమార్ మాట్లాడుతూ పొలంబడి కార్యక్రమం కేవలం శిక్షణ మాత్రమే కాకుండా రైతులు తమ సమస్యలను పరస్పరం చర్చించుకునేందుకు శాశ్వత పరిష్కారం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులే ట్రైనర్లుగా మారడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం నాయకత్వం పెరుగుతాయని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ స్థానికంగా వేరుశెనగ విత్తనాలను కొనుగోలు చేయాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి అరుణ్ బాబు మాట్లాడుతూ త్వరలో ములకలపల్లిలో ఐకేపీ ద్వారా వేరుశనగ నూనె తీసే యూనిట్ నెలకొల్పుతున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సూరిబాబు,సుజాత వేరుశనగ రైతులు పాల్గొన్నారు.