నాణ్యమైన సేవలు అందించాలి
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజలకు మర్యాద పూర్వకంగా నాణ్యమైన పోలీస్ సేవలు అందించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్(Sultanabad Police Station)ను అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీ ముందుగా స్టేషన్ పరిసరాలనుపరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ,స్టేషన్ రైటర్, సీసీటీఎన్ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్లైన్లో వివరాల నమోదు, కేసులు, రికార్డుల అప్లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు.
స్టేషన్ పరిధిలో తరచుగా నమోదవుతున్న నేరాలు,నేరాల నియంత్రణకు తీసుకుంటున్నచర్యలు,పరిధిలోని గ్రామాల పరిస్థితులు, శాంతిభద్రతల పరిస్థితి,పోలీస్ స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై ఎస్ఐను సీపీ అడిగి తెలుసుకున్నారు.5S విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతిఫిర్యాదు దారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులు మరియు ప్రజలకు అందించే పోలీస్ సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు.
రౌడీషీటర్లు,సస్పెక్ట్ షీట్లో ఉన్న వ్యక్తులు,ఇతర నేరస్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ,వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సీపీ సందర్శించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి, మరిన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాజీవ్ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు,సంస్థలతో సమన్వయం చేసుకుంటూ రహదారి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేసి,రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని సీపీ సూచించారు.ఈ తనిఖీలో సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నమనేని రంజిత్ రావు , ఎస్ఐ చంద్రకుమార్ , పోలీసులు ఉన్నారు.