దశాబ్దాల కల నెరవేరేనా..?
– ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు నిధుల కేటాయింపులో జాప్యం
– ఆర్మూర్ నుంచి డిచ్పల్లికి లింక్ కుదిరేనా...?
– రైల్వే లైన్‌కు నిధుల కేటాయింపుపై సర్వత్రా నిర్లక్ష్యం
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్, డిచ్పల్లి మీదుగా సికింద్రాబాద్ రైల్వే లైన్ దశాబ్దాల కల సాకారం దిశగా అడుగులు వేయకపోవడంతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు ఆర్మూర్ ప్రాంత ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. కాగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా పటాన్చెరు వరకు 317 కిలో మీటర్ల రైలు మార్గం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ రైల్వే లైన్లో కీలకమైన ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వే లైన్‌కు మొదటి విడతలో కేంద్రం అంగీకరించినా నిధుల కేటాయింపు లేక కార్యరూపం దాల్చకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.
మరో వైపు ఆర్మూర్ నుంచి డిచ్పల్లి లైన్‌కు కనెక్ట్ చేస్తే ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా సికింద్రాబాద్ వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అవుతుంది. ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న ఈ ప్రాంతంలో సుమారు 40 ఏళ్ల నిరీక్షణ తరువాత నిజామాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా కాగజ్‌నగర్ వరకు రైల్వే లైన్ సాకారం అయింది. దీంతో ఈ ప్రాంతీయుల మరో డిమాండ్ ఆదిలాబాద్–సికింద్రాబాద్ రైల్వే లైన్ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వే లైన్
కీలకమైన ఈ రైల్వే లైన్లో మొదటి దశలో ఆర్మూర్–ఆదిలాబాద్ రైల్వేలైన్ నిర్మాణం కోసం అడుగులు పడ్డాయి. అయితే 136.87 కిలో మీటర్ల నిడివి గల ఆర్మూర్–ఆదిలాబాద్ మధ్య రైల్వే లైన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టాలని గతంలో నిర్ణయించారు. మొత్తం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం, కేంద్ర ప్రభుత్వం 49 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. నిర్మాణం పూర్తయిన తరువాత వచ్చే నష్టాలను ఎవరు భరిస్తారనే విషయమై స్పష్టత లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి.
2007–08 బడ్జెట్లో ఈ రైల్వే లైన్ సర్వే కోసం కేంద్రం నిధులు కేటాయించింది. ఈ మార్గం నిర్మాణానికి రూ.699 కోట్లు అవసరం అవుతుందని సర్వేలో తేల్చారు. 2016–17 కేంద్ర బడ్జెట్లో ఆర్మూర్–నిర్మల్–ఆదిలాబాద్ రైల్వే లైన్‌ను మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే పదేళ్ల పాటు నిధుల కేటాయింపు జరగకపోవడంతో అంచనా వ్యయం విపరీతంగా పెరిగి రూ.2,800 కోట్లకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,428 కోట్లు భరించాల్సి ఉంటుంది.
రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూమిని సమకూర్చడంతో పాటు ఇందుకు అయ్యే వ్యయంలో 51 శాతం భరించడంపై రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అప్పటి నుంచి రైల్వే లైన్ నిర్మాణంపై కదలిక లేకుండా పోయింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడంతో భూమి సర్వేకు మాత్రమే ఈ నిధులను కేటాయించారు. భూసేకరణ అనంతరం రైతులకు నష్ట పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తయితే గాని ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యేలా లేవు.
పెరిగి పోతున్న వ్యయం
ఆదిలాబాద్–ఆర్మూర్ రైలు మార్గంలో సోన్ గోదావరి వద్ద భారీ రైల్వే వంతెన చేపట్టడమే కాకుండా కుప్టి ఘాట్స్ వద్ద మరో వంతెన నిర్మాణానికి సైతం టెక్నికల్ ఇంజినీర్లు ప్రతిపాదనలు సిద్దం చేసారు. అదేవిధంగా మహబూబ్ ఘాట్ వద్ద టన్నెల్స్‌తో పాటు రెండు క్రాసింగ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగిపోయి ఉండటం మరొక సమస్యగా మారనుంది.
ఆర్మూర్ మీదుగా ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. నిజామాబాద్ నుంచి పెద్దపల్లి రైల్వే నిర్మాణం పూర్తయినప్పటికీ రవాణా పరంగా ఆర్మూర్ ప్రాంతీయులు ముంబయ్‌కి వెల్లే వారికి తప్ప ఈ రైల్వే లైన్ పెద్దగా ఉపయోగపడటం లేదు. ఆర్మూర్ ప్రాంతీయులు హైదరాబాద్ వెల్లాలన్నా నిజామాబాద్ మీదుగా వెల్లాల్సిన పరిస్థితి ఉంది.
దీంతో ఆర్మూర్‌కు హైదరాబాద్‌కు రైల్వే లింక్ లేకుండా ఉంది. ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్‌తో పాటు ఆర్మూర్ నుంచి డిచ్పల్లి లైన్‌కు లింక్ చేస్తూ కనెక్టివిటీతో లైన్ నిర్మిస్తే ఆర్మూర్ ప్రాంతీయులు నేరుగా హైదరాబాద్‌కు రవాణ పెరుగుతుంది. కాబట్టి ఆర్మూర్ నుంచి డిచ్పల్లికి లింక్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్మూర్ నుంచి డిచ్పల్లి మీదుగా సికింద్రాబాద్‌కు రైల్వే లైన్ నిర్మించాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆర్మూర్ ఎమ్మెల్యే పలు మార్లు వినతి పత్రాలు సైతం సమర్పిస్తున్నారు.
ఆదిలాబాద్ – పటాన్చెరు
ఆదిలాబాద్ నుంచి నిర్మల్, ఆర్మూర్, డిచ్పల్లి మీదుగా నారాణ్‌ఖేడ్, సంగారెడ్డి పటాన్చెరు వరకు రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీంతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు, మరో వైపు నిజామాబాద్ , కరీంనగర్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ రైల్వే లైన్‌కు అనుసందానం పెరుగనుంది. ఈ రల్వే మార్గం సిద్దమైతే ఆదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్ ప్రాంతాల్లో పరిశ్రమలు విరివిగా స్థాపించే అవకాశం ఉంటుంది.
జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా రైలు మార్గం సిద్దమయితే ఈ ప్రాంతాల్లో పండించే పసుపు, ఎర్రజొన్న, పత్తి, వరి లాంటి పంటలను ఎగుమతి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నిజామాబాద్ జిల్లా ప్రజలకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్, నాందేడ్, ముంబయ్, జాల్నాకు రవాణ సౌకర్యం మరింత మెరుగుపడి జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఏర్పడనుంది.