నూతన తీర్థాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
మహాదేవపూర్/ కాళేశ్వరం, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): పుష్కరాల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించిన నూతన తీర్థాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాల కోసం చేపట్టిన రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ (Additional Collector (Revenue) Ashok Kumar) అధికారులను ఆదేశించారు. బుధవారం సిరోంచ–కాటారం ప్రాంతంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. సిరోంచ వంతెన నుంచి ప్రధాన ఘాట్ వరకు రెండు కిలోమీటర్లు, సరస్వతీ ఘాట్ నుంచి పక్షి తీర్థం వరకు 0.8 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయనున్న ఐదు నూతన తీర్థాల ప్రతిపాదిత స్థలాలను పరిశీలించారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.
ఆది ముక్తేశ్వర దేవాలయం నుంచి సరస్వతీ ఘాట్ వరకు భూసేకరణ పూర్తయిన శాశ్వత రహదారి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, పనులను వేగవంతంగా నిర్దేశిత ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. సిరోంచ వంతెన సమీపంలోని వినాయక విగ్రహాల నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా చర్యలు, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం కన్నెపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల పునఃసర్వే పనులను పరిశీలించి, పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, మండల సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.