క్రీడలతోనే క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం
- పెద్దపల్లి జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్
- టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడం అజయ్
సుల్తానాబాద్, సెప్టెంబర్ 27:(విజయ క్రాంతి): విద్యార్థుల్లో క్రీడలతో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందుతాయని పెద్దపల్లి జిల్లా(Peddapalli District) ఎస్జీఎఫ్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోడం అజయ్ అన్నారు.చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని ఎస్ఎన్ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో ఆదివారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలు(Table Tennis Competitions) ఉత్సాహంగా నిర్వహించారు.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన క్రీడాకారులు(Athletes) పోటీల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ విజయమే లక్ష్యంగా హోరాహోరీగా తలపడ్డారు.ఈ సందర్భంగా లక్ష్మణ్, కోడం అజయ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక వికాసం కలుగుతుందన్నారు. క్రీడా పోటీలు గెలుపోటములను సమానంగా స్వీకరించే తత్వాన్ని, జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.పోటీలను కనుకుంట్ల లక్ష్మణ్, కోడం అజయ్, నోడల్ ఆఫీసర్ శోభారాణి, పీఈటీ కార్యదర్శి దాసరి రమేష్, అధ్యక్షుడు సురేందర్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, సాధన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వేముల కిరణ్ ప్రారంభించారు.
అనంతరం విజేతలకు సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమం లో మండల ఎస్జీఎఫ్ కన్వీనర్ తాండ్ర ప్రణయ్, వెంకటేష్, ఇక్బాల్, ఖాజాబీ, శైలజ, విష్ణు, ఎస్ఎన్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ సత్యనారాయణ, శ్రీకాంత్, రాజ్‌కుమార్, గౌతమ్‌రెడ్డి, కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.